బాధితుడికి జావిద్ భరోసా..!
– పార్టీలు వేరైనా.. పరామర్శలో ముందు
– హైదరాబాద్ తరలించే వరకు తోడుగా
తాండూరు, దర్శిని ప్రతినిధి : రాజకీయ విభేదాలు ఒకవైపు.. మానవత్వం మరోవైపు. సొంత పార్టీ నాయకులతో విభేదాల నేపథ్యంలో దాడికి గురయ్యానంటూ ఓ కాంగ్రెస్ కార్యకర్త ఆవేదన వ్యక్తం చేస్తే.. అతడికి అండగా ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీకి చెందిన కౌన్సిలర్ జావిద్ తోడుగా నిలిచాడు.

బాధితుడు సమాచారం ఇవ్వగానే స్పందించి ఆసుపత్రికి చేరుకుని పరామర్శించడమే కాకుండా మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించే వరకు బాధితుడికి ధైర్యం చెప్పడం చర్చనీయాంశంగా మారింది. తాండూరు పట్టణంలోని 8వ వార్డులో కాంగ్రెస్ పార్టీ కమిటీల వ్యవహారంలో వార్డు ఇన్చార్జి సాయప్ప, అదే కాలనీకి చెందిన నాజర్ మధ్య కొంతకాలంగా విభేదాలు ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో శుక్రవారం రాత్రి సాయప్ప, ఆయన కుమారులు తనపై దాడికి పాల్పడ్డారని నాజర్ ఆరోపించాడు. బైక్పై హైదరాబాద్ రోడ్డు మార్గంలో వెళ్తుండగా తనపై దాడి చేశారని తెలిపాడు. ఘటనలో గాయపడిన నాజర్ను చికిత్స కోసం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అంతకుముందే తనను ప్రత్యర్థులు దాడి చేస్తున్నారని నాజర్ జావిద్కు సమాచారం అందించాడు. విషయం తెలుసుకున్న వెంటనే జావిద్ ఆసుపత్రికి చేరుకున్నారు.

తాను ప్రాతినిధ్యం వహిస్తున్న వార్డులోని వ్యక్తి కష్టాల్లో ఉన్నాడన్న దృక్పథంతో బాధితుడిని పరామర్శించారు. రాజకీయాలకు అతీతంగా నాజర్కు ధైర్యం చెప్పారు. వైద్యులు మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కు తరలించాలని సూచించడంతో.. నాజర్ను హైదరాబాద్కు తరలించే వరకు జావిద్ వెంట ఉండి సహకరించారు. ప్రతిపక్ష పార్టీలో ఉన్నప్పటికీ బాధితుడి పిలుపుకు స్పందించి అండగా నిలవడం స్థానికంగా చర్చకు దారితీసింది.


