అబ్బుర పరిచిన గణితావధానం
– కళ్లకు గంతలతో అంకెల వివరణ
– జ్ఞాపకశక్తి మెరుగుపై అవగాహన
– ది శాస్త్ర స్కూళ్లో వినూత్న కార్యక్రమం
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం సాయిపూర్లోని ది శాస్త్ర స్కూళ్లో నిర్వహించిన గణితావధానం విద్యార్థులను అబ్బుర పరిచింది.

విద్యార్థులకు గణితంతో పాటు జ్ఞాపకశక్తిని ఆసక్తిగా ఎలా మెరుగు పరుచుకోవాలో అనే దానిపై వినూత్న ప్రదర్శన ఇచ్చారు. గురువారం రాష్ట్రపతి అవార్డు గ్రహీత, రిటైర్డ్ ప్రధానోపాధ్యాయులు అనంతప్ప యాదవ్ విద్యార్థులకు గణితంపై ఆసక్తి పెంచేలా పలు వినూత్న మెళకువలను ప్రదర్శించారు.

శతావధానంలో భాగంగా బోర్డుపై ఒకటి నుంచి వంద వరకు సంఖ్యలను రాయించి, విద్యార్థులు సూచించిన వివిధ పదాలను ఆయా అంకెలకు అన్వయించుకున్నారు. అనంతరం కళ్లకు గంతలు కట్టుకుని వాటిని వరుసగా గుర్తిస్తూ చెప్పడంతో విద్యార్థులు ఆశ్చర్యానికి గురయ్యారు. అలాగే మాయ కూడిక, మాయ చదరం, తేదీ చెబితే వరం చెప్పడం వంటి ఆసక్తికరమైన గణిత అంశాలను విద్యార్థులకు వివరించారు.

జ్ఞాపకశక్తి, ఏకాగ్రత పెంపొందించుకోవడానికి పాటించాల్సిన పద్ధతులపై సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఉపాధ్యాయులు ప్యాట సుభాన్ రెడ్డి, జగన్నాథ్ రెడ్డి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు కే. శ్రీశైలం, అకాడమిక్ ఇన్చార్జి హరిత, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.


