అర్ద‌రాత్రి ఆవుల చోరీ..!

క్రైం తాండూరు వికారాబాద్

అర్ద‌రాత్రి ఆవుల చోరీ..!
– నియోజ‌క‌వ‌ర్గంలో రెచ్చిపోతున్న దొంగ‌లు
– తాండూరు, పెద్దేముల్ మండ‌లాల్లో క‌ల‌క‌లం
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి: ఎవ‌రైనా ఇంట్లో దొంగ‌త‌నానికి పాల్ప‌డితే డ‌బ్బులు, న‌గ‌లు, విలువైన వ‌స్తుల‌ను ఆప‌హ‌రించుకుపోవ‌డం చేస్తారు. తాండూరు నియోజ‌క‌వ‌ర్గంలో గ‌త కొన్ని రోజులుగా ఇందుకు భిన్నంగా కొంద‌రు దొంగ‌లు చోరీల‌కు పాల్ప‌డుతున్నారు. అంద‌రిని ఆశ్చ‌ర్యానికి.. ఆందోళ‌న‌కు గురిచేసేవిధంగా ఇంటి ముందు క‌ట్టేసి ఉంచిన ఆవుల‌ను ఎత్తుకెళుతున్నారు. నియోజ‌క‌వ‌ర్గంలోని తాండూరు మండ‌లం, పెద్దేముల్ మండ‌లాల్లో వ‌రుస‌గా న‌మోదు అవుతున్న ఈ సంఘ‌ట‌న ఆందోళ‌న క‌లిగిస్తోంది. స‌రిగ్గా అర్ద‌రాత్రి ఈ సంఘ‌ట‌న‌లు చోటు చేసుకోవ‌డం క‌ల‌క‌లం రేపుతోంది. తాండూరు మండ‌లం గౌతాపూర్ గ్రామానికి చెందిన జ‌న్నె పాల‌రాములు వ్య‌వ‌సాయం చేస్తూ పాడి ప‌శువుల‌ను పోషిస్తున్నాడు. శుక్ర‌వారం రాత్రి త‌న ఆవును ఇంటి ముందు క‌ట్టేసి నిద్రించాడు. శ‌నివారం తెల్ల‌వారు జామున పాలు పితికేందుని వెళ్ల‌గా ఆవు క‌నిపించ‌లేదు. ఆవుకోసం గాలిస్తుండ‌గా దానికి క‌ట్టి ఉంచిన తాళ్ల‌తో పాటు ఓ వాహ‌నం అక్క‌డి నుంచి వెళ్లిన‌ట్లు గుర్తించాడు. దీంతో క‌ర‌ణ్ కోట్ పోలీసుల‌ను ఆశ్ర‌యించి ఫిర్యాదు చేశాడు. గ‌త నెల రోజుల క్రితం అదే గ్రామానికి చెందిన రాంచెంద్రారెడ్డికి చెందిన రెండు ఆవుల‌ను కూడ ఎత్తుకెళ్లిన‌ట్లు గ్రామ‌స్తులు గుర్తుచేశారు. మ‌రోవైపు పెద్దేముల్ మండలంలోని కందనెల్లి తండాలో కూడ ఆవుల చోరీ కలకలం రేపింది. తండాలోని ఓ రైతుకు చెందిన ఒక ఎద్దు, రెండు ఆవులు, ఒక లేగదూడను ఎత్తుకెళ్లినట్లు తెలిపారు.

నిఘా ముమ్మరం
నియోజకవర్గంలో వరుసగా చోటు చేసుకుంటున్న ఘటనలపై పోలీసులు అప్రమత్తం అయ్యారు. గౌతాపూర్ సంఘ‌ట‌న‌పై క‌ర‌ణ్ కోట్ పోలీసులు విచార‌ణ ముమ్మ‌రం చేశారు. ఎస్ఐ మ‌ధుసూధ‌న్ రెడ్డి గ్రామంలో సంఘ‌ట‌నా స్థ‌లాన్ని ప‌రిశీలించారు. ఈ క్ర‌మంలో అంత‌ర్ రాష్ట్ర ర‌హ‌దారి, గ‌నుల శాఖ చెక్ పోస్టు వ‌ద్ద సీసీ కెమెరాల పుటేజీనీ ప‌రిశీలించారు. దీని ఆధారంగా విచార‌ణ చేప‌ట్టి నిందితుల‌ను గుర్తించేందుకు చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. మ‌రోవైపు ఇలాంటి సంఘ‌ట‌న‌ల‌ను చోటు చేసుకోకుండా నిఘాను ఉంచారు.