అభివృద్ధి ప‌నుల‌ను క్షేత్ర‌స్థాయిలో ప‌రిశీలిస్తా…!

తాండూరు రంగారెడ్డి వికారాబాద్

ప్ర‌గ‌తి ప‌నుల్లో వేగం పెంచాలి
– నెలాఖ‌రులోగా వైకుంఠాదామాలు, ప‌ల్లె ప్ర‌కృతి వ‌నాలు
– బృహ‌త్ వ‌నాల‌కు స్థ‌లాల‌ను సేక‌రించాలి
– అధికారుల‌తో వికారాబాద్ జిల్లా క‌లెక్ట‌ర్ కె.నిఖిల
ద‌ర్శిని ప్ర‌తినిధి: వికారాబాద్ జిల్లాలో అసంపూర్తిగా ఉన్న ప్ర‌గ‌తి ప‌నుల్లో వేగం పెంచాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ కె.నిఖిల అధికారుల‌ను ఆదేశించారు. ఈనెలాఖ‌రులోగా నిర్మాణంలో వైకుంఠదామాలు, పల్లె ప్రకృతి వానలను సిద్దం చేయాల‌న్నారు. గురువారం స్థానిక డీపీఆర్సీ భ‌వ‌నంలో జిల్లా క‌లెక్ట‌ర్ స్పెషల్ ఆఫీసర్లు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, ఎంపీవోలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ నిఖిల‌ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులు ఏయే దశ‌లో ఉన్నాయ‌ని ఆరా తీశారు. వైకుంఠదామాలు, డంపింగ్ యార్డులు, రైతు వేదికలు, పల్లె ప్రకృతి వనాల ప‌నులను వేగ‌వంతం చేయాల‌న్నారు. వాటి ఆవ‌ర‌ణ‌లో మొక్కలు నాటి ఆహ్లాద‌క‌ర వాతావ‌ర‌ణాన్ని తీర్చి దిద్దాలన్నారు. ఆయా భ‌వ‌నాలు, వ‌నాల వ‌ద్ద నీటి సదుపాయాలు కల్పించాలని సూచించారు. పల్లె ప్రకృతి లేని గ్రామాలకు స్థల సేకరణ వారం రోజులలో పూర్తి చేయాలని తహసీల్దార్లను ఆదేశించారు. బృహత్ పల్లె ప్రకృతి వనాల కోసం కూడా పది ఎకరాలకు తగ్గకుండా స్థలం సేకరించాలన్నారు. గ్రామాల్లో ప్రధాన ఇరువైపులా అవెన్యూ ప్లానిటేషన్‌లో భాగంగా మొక్కలు నాటించి గ్రామాల‌ రూపు రేఖలు మారిపోయేలా చూడాల‌న్నారు. ఇందులో భాగంగా రోడ్లకు ఇరువైపులా మ‌ల్టీలెవ‌ల్ ప్లానిటేష‌న్ అనగా రెండు వరసలలో మొక్కలు నాటేందుకు గుంతలు తీయాలన్నారు. ఇందుకోసం నిధులు గ్రామ పంచాయతీ గ్రీన్ బడ్జెట్ ను వినియోగించుకోవాలని తెలిపారు. ఇప్పటికే పూర్తి కావలసిన పనులు పూర్తి కాకపోవడంపై అసంతృప్తి వ్యక్తపరిచారు. త్వ‌ర‌లోనే చేపట్టిన పనులను క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తానని, నిర్లక్ష్యం వహించే వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్లు మోతిలాల్, చంద్రయ్య, జడ్పీ సీఈఓ జానకి రెడ్డి, డీఆర్డీఓ కృష్ణన్, డీపీవో రిజ్వానా, అట‌విశాఖ జిల్లా అధికారి వేణుమాధవ్, స్పెషల్ ఆఫీసర్లు, ఆర్డీఓలు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, ఎంవీవోలు తదితరులు పాల్గొన్నారు.