షిర్డీ యాత్రలో విషాదం
– ట్రక్కును ఢీకొన్న బస్సు
– 10 మంది యాత్రికుల దుర్మరణం
దర్శిసి డెస్క్ : షీర్డీ యాత్రలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం బాధిత కుటుంబాల్లో విషాదం నింపింది. మహరాష్ట్రలోని షిర్డీ యాత్రికులతో వెళ్తోన్న ఓ బస్సు ట్రక్కును ఢీకొట్టింది. శుక్రవారం ఉదయం చోటుచేసుకున్న ఈ ఘటనలో 10 మంది యాత్రికులు దుర్మరణం చెందారు. స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఠాణె జిల్లా నుంచి యాత్రికులను తీసుకుని ఓ ప్రైవేటు లగ్జరీ బస్సు షిర్డీ (Shirdi)కి బయల్దేరింది. శుక్రవారం ఉదయం నాసిక్-షిర్డీ హైవేపై ఈ బస్సు ఎదురుగా వస్తున్న ట్రక్కును వేగంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో పది మంది అక్కడికక్కడే మృతిచెందారు. మృతుల్లో ఏడుగురు మహిళలు, ఇద్దరు చిన్నారులు ఉన్నారు. ఈ ఘటనలో పలువురు తీవ్రంగా గాయపడగా స్థానిక ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రుల్లో కొందరి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశమున్నట్లు అధికారులు చెబుతున్నారు.

