మూడో ముప్పుకు ముంద‌స్తు ప్ర‌ణాళిక‌లు

తెలంగాణ

మూడో ముప్పుకు ముంద‌స్తు ప్ర‌ణాళిక‌లు
– ప్ర‌భుత్వానికి ఆదేశించిన హైకోర్టు
ద‌ర్శ‌ని ప్ర‌తినిధి : రాష్ట్రంలో కరోనా మూడో ద‌శ ముప్పుపై ముంద‌స్తు ప్ర‌ణాళిక‌లు రూపొందిచాల‌ని హైకోర్టు ప్ర‌భుత్వాన్ని ఆదేశించింది. రాష్ట్రంలోని క‌రోనా పరిస్థితులపై బుధ‌వారం హైకోర్టు విచార‌ణ జ‌రిపింది. మూడో దశ కరోనాను ఎదుర్కొనే ప్రణాళికను ప్రభుత్వం సమర్పించకపోవడంపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. విద్యా సంస్థలు ప్రారంభమైనందున పిల్లల్లో కరోనా సోకకుండా మరింత అప్రమత్తత అవసరమని హైకోర్టు వ్యాఖ్యానించింది. ప్రభుత్వం చేతులెత్తయకుండా ముందే ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని హైకోర్టు సూచించింది. జిల్లాల్లోనూ పిల్లల ఆరోగ్య పరిరక్షణ వ్యవస్థను మెరుగుపరచాలని హైకోర్టు ఆదేశించింది.

జులై 15న నిపుణుల కమిటీ సమావేశమై పలు సిఫార్సులను చేసిందని ఏజీ తెలిపారు. నిపుణుల కమిటీల సిఫార్సుల అమలుకు ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుందని హైకోర్టు ప్రశ్నించింది. ఈనెల 22 వరకు మూడో దశ కరోనా ప్రణాళికను ప్రభుత్వం సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. కరోనాను ఎదుర్కొనే సన్నద్ధతపై ప్రభుత్వం తన బాధ్యత నిర్వర్తిస్తుందని ఆశిస్తున్నామని హైకోర్టు పేర్కొంది. ప్రభుత్వం స్పందించక పోతే న్యాయస్థానం జోక్యం చేసుకుంటుందని ధర్మాసనం వ్యాఖ్యానించింది.

క‌రోనా కేసుల్లో హెచ్చుత‌గ్గులు
మ‌రోవైపు తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసుల్లో హెచ్చుతగ్గులు చోటుచేసుకుంటున్నాయి. గ‌త 24 గంటల్లో 73,323 కరోనా పరీక్షలు నిర్వహించగా, కొత్తగా 324 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,62,526కు చేరుకుంది. ఇక, నిన్న కరోనా బారినపడి ఒక్కరు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా మహమ్మారి ధాటికి బలైనవారి సంఖ్య 3,899కు చేరింది. అదే సమయంలో 280 మంది కరోనా నుంచి కోలుకోగా, మొత్తంగా చూస్తే.. 6,53,302 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 5,325 మంది ప్రస్తుతం కోవిడ్ చికిత్స పొందుతున్నారు. ఇక, ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తంగా 2,56,53,080 నమూనాలు పరీక్షించినట్లు తెలంగాణ వైద్య ఆరోగ్య బుధవారం సాయంత్రం విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.

జిల్లాల వారీగా నమోదైన కరోనా కేసులు…