గుండెపోటుతో బీఆర్ఎస్ యువనేత కన్నుమూత

తాండూరు రాజకీయం వికారాబాద్

గుండెపోటుతో బీఆర్ఎస్ యువనేత కన్నుమూత
– విచారం వ్యక్తం చేసిన పార్టీ నేతలు
– కుటుంబంలో విషాధం
తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి: బీఆర్ఎస్ పార్టీకి చెందిన తాండూరు మండల యువనేత గుండెపోటుతో కన్నుమూశారు. ఈ సంఘటనపై పార్టీ నేతలు విచారం వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళితే.. తాండూరు మండలం గుంటాబాస్పల్లి గ్రామానికి చెందిన సయ్యద్‌ జాఫర్ గ్రామ బీఆర్ఎస్ అధ్యక్షులుగా పనిచేస్తున్నారు. జాఫర్ కుటుంబంతో కలిసి తాండూరు పట్టణంలో అద్దెకు ఉంటున్నారు. అయితే సోమవారం తెల్లవారు జామున 4 గంటల ప్రాంతంలో ఛాతిలో నొప్పి వస్తుందని చెప్పడంతో కుటుంబ సభ్యులు వెంటనే తాండూరు ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి తరలించారు. విధుల్లో ఉన్న వైద్యులు జాఫర్ పటేల్ కు ఈసీజీ నిర్వహించి ఎలాంటి ప్రమాదం లేదని, ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం ఇంటికి వెళ్లిన జాఫర్ పటేల్ కుర్చీలో కూర్చొని టాబ్లెట్ వేసుకునే సమయంలోనే మరోసారి ఛాతి నొప్పి రావడంతో కింద పడిపోయాడు. మళ్లీ కుటుంబ సభ్యులు వెంటనే జిల్లా ఆసుపత్రికి తరలించారు. పరిశీలించిన వైద్యులు సీరియస్ గా ఉందని మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ కు తరలించాలని సూచించారు. అంబులెన్స్ లో హైదరాబాద్ తరలిస్తుండగా మార్గమధ్యం వికారాబాద్ సమీపంలో మృతి చెందినట్లు గుంతబాస్పల్లి గ్రామ సర్పంచ్ జగదీష్ తెలిపారు.

జాఫర్‌కు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. బీఆర్‌ఎస్ పార్టీలో చురుకైన పాత్ర పోషిస్తూ అందరితో కలిసి మెలిసి ఉండే జాఫర్‌ మరణంపట్ల పార్టీ నేతలు విచారం వ్యక్తం చేశారు. గుండెపోటుతో మరణించిన జాఫర్ కుటుంబ సభ్యులు శోకసముద్రంలో ఉండిపోయారని, జాఫర్ పటేల్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామ సర్పంచ్, గ్రామస్తులు కోరుతున్నారు.

మరోవైపు తాండూరు జిల్లా ఆసుపత్రిలో ప్రజలకు వైద్యం అందించడంలో చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విధుల్లో ఉన్న వైద్యులు చికిత్స నిమిత్తం వెళ్లే వారితో దురుసుగా ప్రవర్తిస్తున్నారని ఆరోపణలు వినిపించాయి. అధికారులు స్పందించి జిల్లా ఆస్పత్రిలో పేద ప్రజలకు చక్కటి వైద్యం అందించేందుకు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

ఇది కూడా చదవండి…

పేద విద్యార్థుల సేవలో..!