భగ్గుమన్న బల్దియా ఉద్యోగులు
– చైర్ పర్సన్ భర్త వేధింపులంటూ నిరసన
– మద్దతు తెలిపిన కాంగ్రెస్, బీజేపీ కౌన్సిలర్లు
– తాండూరు ఆర్డీఓకు వినతిపత్రం అందజేత
– చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు మున్సిపల్(బల్దియా) ఉద్యోగులు భగ్గుమన్నారు. మున్సిపల్ చైర్ పర్సన్ భర్త అధికారులు, సిబ్బందిపై వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. శుక్రవారం ఉదయం మున్సిపల్ ఉద్యోగులు, సిబ్బంది, కార్మికులు నల్లబ్యాడ్జీలు ధరించి మున్సిపల్ ముందు నిరసన వ్యక్తం చేశారు. దాదాపు గంట పాటు ఉద్యోగులు, సిబ్బంది, కార్మికులు ఆందోళన కొనసాగించారు. ఈ సందర్భంగా మేనేజర్ బుచ్చిబాబు, శానిటరీ ఇనుస్పెక్టర్ శ్యాంసుందర్‌తో పాటు పలువురు మాట్లాడుతూ ఉద్యోగులు, కార్మికులు, సిబ్బందిపై చైర్ పర్సన్ భర్త వేధింపులను ఆపాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్, బీజేపీ, టీజేఎస్ కౌన్సిలర్లు, నాయకుల మద్దతు
మున్సిపల్‌లో ఉద్యోగులు, సిబ్బంది, కార్మికులు చేపట్టిన ఆందోళనకు కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు, కౌన్సిలర్ ప్రభాకర్ గౌడ్, ఫ్లోర్ లీడర్ వరాల శ్రీనివాస్‌రెడ్డి, టీజేఎస్ ఫ్లోర్ లీడర్ సోమశేఖర్, సీపీఐ ఫ్లోర్ లీడర్ ఆసీఫ్, బీజేపీ కౌన్సిలర్లు అంతారం లలిత, సాహు శ్రీలతతో పాటు నాయకులు రజనీకాంత్ తదితరులు మద్దతు తెలిపారు. మున్సిపల్ విషయాల్లో చైర్ పర్సన్ భర్త జోక్యం చేసుకోవడం తగదన్నారు. అధికారులు, సిబ్బందిపై వేధింపులు, బెధిరింపులకు పాల్పడడం సమంజసం కాదన్నారు. వెంటనే చైర్ పర్సన్ భర్తపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఆర్డీఓ, పట్టణ సీఐకి ఫిర్యాదు
మున్సిపల్ ఉద్యోగులు, సిబ్బంది, కార్మికులపై చైర్ పర్సన్ భర్త వేధింపులకు.. బెధిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ ఉద్యోగులు, సిబ్బంది తాండూరు ఆర్డీఓ, ఇంచార్జ్ కమీషనర్ అశోక్ కుమార్‌కు ఫిర్యాదు చేశారు.
అంతకుముందు కాంగ్రెస్, బీజేపీ, టీజేఎస్ కౌన్సిలర్లు, నాయకులతో కలిసి ఆర్డీఓ కార్యాలయానికి చేరుకున్నారు. అనంతరం ఆర్డీఓ అశోక్ కుమార్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. అదేవిధంగా పట్టణ పోలీస్టేషన్‌కు చేరుకుని పట్టణ సీఐ రాజేందర్‌రెడ్డికి ఫిర్యాదు చేశారు.
కొట్టిస్తానని బెధిరించారు : శ్యాంసుదర్, శానిటరీ ఇనుస్పెక్టర్
చైర్ పర్సన్ భర్త చెప్పిన మాట వినకపోతే కొట్టిస్తానని బెధింరించారని శానిటరి ఇనుస్పెక్టర్ శ్యాంసుందర్ ఆరోపించారు. చైర్ పర్సన్ కారు డ్రైవర్ ద్వారా ఫోన్‌లో మాట్లాడుతూ `మా బండ్లకు ఎందుకు డీజీల్ కొట్టించవ్.. నీ వొక్కడివేనా వచ్చింది.. అందరు మాకు పనిచేసిన వాళ్లే.. పిలిచినప్పుడు ఎందుకు రెస్పాండ్ కావు.. నాగురించి నీకు తెలియదు.. నీవు ఎక్కడినుంచో వచ్చినావు.. జాగ్రత్తగా పనిచేసుకుని పో.. నేను చెప్పిన మాట ఖచ్చితంగా వినాలే.. లేదంటే ఎక్కడైనా ఇరికిస్తా.. ఎవరితోనైనా కొట్టిస్తా.“ అంటూ బెధింరించారని మీడియా ముందు వాపోయారు. ఈ విషయంపై చైర్ పర్సన్ భర్తపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
https://youtu.be/vdDLoFPL4rI