క్యా బాత్‌హై రిజ్వాన్ భాయ్..!
– వాగ్దానాలన్నింటికి నోటరీ ఇస్తా
– ఆలోచించే ఓటేయండి
– స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్
తాండూరు, దర్శిని ప్రతినిధి: ఎన్నికల్లో ఎవరైనా ఎన్నో హామి ఇస్తారు కానీ నేను ఇచ్చే వాగ్దానాలకు నోటరీ చేయించి ఇస్తా అంటూ ఓ సామాన్యుడు ప్రకటించడం వికారాబాద్ జిల్లా తాండూరులో సంచలనంగా మారింది. తాండూరు మండలం అంతారం గ్రామానికి చెందిన మహమ్మద్ ముస్తఫా రిజ్వాన్ సామాజిక కార్యకర్తగా పనిచేస్తున్నారు. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని తాండూరు నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలుస్తున్నారు. సోమవారం తాండూరు ఎన్నికల అధికారి కార్యాలయంలో ఆయన స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం రిజ్వాన్ మాట్లాడుతూ ఎన్నికల్లో గెలిస్తే తాండూరును ఇంటర్నేషనల్ స్థాయిలో అభివృద్ధి చేస్తానని అన్నారు.
ఎన్నికల్లో పెద్ద పెద్ద పార్టీలు, అభ్యర్థులు ఎన్నో హామి ఇస్తుంటారని గుర్తుచేస్తూ వాటికి ఎలాంటి నోటరీలు ఇవ్వరని అన్నారు. తాను మాత్రం తాండూరు ప్రజలకు ఇచ్చే వాగ్దానాలకు న్యాయవాది ద్వారా నోటరి చేసి ఇస్తున్నానని స్పష్టం చేశారు. తాండూరు ప్రజలకు ఏం కావాలో వాటిని నేరవేర్చేందుకు కృషి చేస్తానని అన్నారు. నిధుల్లో అందరికి సమన్యాయం జరిగేలా చూస్తానని అన్నారు. తాండూరులో ఎలాంటి దర్నాలు, రాస్తారోకోలు చేసే పరిస్థితి రాకుండా చూస్తానని అన్నారు. ఒక నౌకరుగా ప్రజలకు సేవ చేస్తానని అన్నారు. ఓటర్లను గెలిపించేందుకు తాను పోటీలో ఉంటున్నానని, మంచి చేస్తాననని నమ్మితేనే ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. మరోవైపు రిజ్వాన్ తన వాగ్దానాలకు నోటరీ చేసి ఇస్తానని చేసి ప్రకటన ప్రజలను ఆలోచింప జేసింది. ఈ నిర్ణయం తాండూరులో చర్చనీయాంశంగా మారింది.
ఇదికూడా చదవండి…

