కిలాడీ.. కిల్లర్..!
– ఆధారాల్లేకుండా ఆరు హత్యలు
– మహిళలే లక్ష్యంగా సైకోయిజం
– చిల్లర ఖర్చుల కోసమే దారుణాలు
– హంతకున్ని రిమాండుకు తరలించిన పోలీసులు
– వీడిన అడివిలో మహిళ హత్య మిస్టరీ
– వివరాలు వెల్లడించిన తాండూరు డీఎస్పీ శేఖర్ గౌడ్
తాండూరు, దర్శిని ప్రతినిధి : ఎలాంటి ఆధారాల్లేకుండా హత్యలు చేయడం అతని నైజం. చిల్లర ఖర్చుల కోసం అడ్డా కూలీ మహిళలను టార్గెట్ చేసి దారుణాలకు తెగబడ్డాడు. ఆరు హత్య కేసుల్లో జైలుకు వెళ్లినా కిల్లింగ్ హాబిని మానుకోలేదు. 7వ హత్య కేసులో ఈ కిలాడీ కిల్లర్ ఆటకట్టించారు వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణ పోలీసులు. తాండూరు పట్టణంలో అదృశ్యమై హత్యకు గురైన మహిళ మర్డర్ మిస్టరీని పోలీసులు చేధించారు. శుక్రవారం తాండూరు డీఎస్పీ కార్యాలయంలో డీఎస్పీ శేఖర్ గౌడ్ పట్టణ సీఐ రాజేందర్ రెడ్డితో కలిసి కేసు వివరాలను వెల్లడించారు.
తాండూరు పట్టణం ధన్ గర్ గల్లిలో నివాసముండే సర్వాబీ(42) అడ్డా కూలీగా పనిచేస్తుండేది. గత నెల 29న ఇంటి నుంచి పనికోసం వెళ్లిన ఆమె తిరిగి ఇంటికి రాలేదు. ఈనెల 1న భర్త మహమూద్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. తాండూరు పట్టణ సీఐ రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో కేసు విచారణ ముమ్మరం చేశారు. సీసీ కెమెరాల ఆధారంగా స్వరాబీ అదృశ్యమైన రోజున ధారూర్ మండలం అల్లీపూర్ గ్రామానికి చెందిన మాల కిష్టప్ప (55) అనే వ్యక్తి వెంట వెల్లినట్లు గుర్తించారు.
తట్టేపల్లి అడవిలో హత్య
నిందితుడు కిష్టప్పను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టడంతో సర్వాబీ హత్య ఘటన వెలుగులోకి వచ్చింది. తాండూరు పట్టణంలోని అడ్డా వద్ద కిష్టప్ప సర్వాబీని ఓ గ్రామంలో పని ఉందని చెప్పి జహీరాబాద్ వైపు వెళ్లే బస్సులో వెంట తీసుకెళ్లాడు. తట్టేపల్లి అడవి ప్రాంతానికి తీసుకెళ్లి ఆమె చీర కొంగుతోనే హత్య చేసి ఆమె వద్ద ఉన్న చైనాలు, మొబైల్ ఫోన్, రూ.1000 నగదును తీసుకుని స్వగ్రామానికి వెళ్లిపోయాడు. పోలీసుల విచారణలో సర్వాబీను అడవిలోనే హత్యచేసినట్లు నేరం అంగీకరించాడు.
అడ్డా మహిళా కూలీలే టార్గెట్
మహిళను హత్య చేస్తూ సైకోయిజం ప్రదర్శిస్తున్నట్లుగా పోలీసులు అనుమానాలను వ్యక్తం చేశారు. గతంలో వికారాబాద్ పోలీస్టేషన్ పరిధిలో మూడు హత్యలు, యాలాల, ధార్, తాండూరు పోలీస్టేషన్లలో మొత్తం ఆరు హత్య కేసులు నమోదైనట్లుగా పోలీసులు గుర్తించారు. ఇందులో 5 హత్య కేసుల్లో ఎలాంటి ఆధారాలు లేకుండా హత్యలు చేయడంతో వాటిని కొట్టివేసినట్లుగా పోలీసులు వెల్లడించారు. కేవలం చిల్లర ఖర్చుల కోసమే ఎంచుకున్న మహిళలను హత్య చేసి.. వారి వద్ద ఉన్న నగదు, వస్తువులను అపహరించుకోవడం అలవాటుగా చేసుకున్నట్లు తేలిందన్నారు. గత హత్య కేసుల్లో 2021 నుంచి 2023 వరకు రెండేళ్ల పాటు జైల్లో ఉన్నాడని, ఇటీవలే బయటకు వచ్చిన . కిష్టప్ప ఒక సైకోలాగా మారి హత్యలకు పాల్పడుతున్నట్లుగా అనుమానాలు వ్యక్తం చేశారు. హంతకుడు కిష్టప్ప ఆధారాల్లేకుండా ఇంకా ఎన్నో హత్యలు చేసి ఉండొచ్చని అనుమానాలు వ్యక్తం చేశారు.
పక్కా ఆధారాలతో రిమాండ్
ఇదివరకు చేసిన ఆరు హత్యల్లో ఎలాంటి ఆధారాలు లేనప్పటికి ఈ సారి 7వ హత్య కింద చేసిన మహిళ హత్య కేసులో పక్కా ఆధారాలను సేకరించడం జరిగిందని డీఎస్పీ శేఖర్ గౌడ్ తెలిపారు. హంతకుడు మృతురాలిని వెంట తీసుకెళుతున్నట్లు సీసీ పుటేజీలతో పాటు హత్య చేసిన ప్రాంతాల వివరాలను అతని ద్వారానే పక్కాగా నమోదు చేయడం జరిగిందన్నారు. ఈ ఆధారాలతో కోర్టులో హంతకున్ని రిమాండు చేయడం జరుగుతుందని వెల్లడించారు. మరోవైపు హంతకుని వద్ద నుంచి మృతురాలి సెల్ ఫోన్, చైనాలతో పాటు రూ.1000ల నగదును స్వాదీనం చేసుకున్నట్లు వివరించారు.
ఇదికూడా చదవండి…

