ఆరేండ్లుగా బైకుల దొంగతనం..!

క్రైం తాండూరు రాజకీయం

ఆరేండ్లుగా బైకుల దొంగతనం..!
– పార్కింగ్ ప్లేసులే టార్గెట్‌గా చోరీలు
– పదిసార్లు జైలుకెళ్లినా మారని బుద్ది
– అడ్డంగా బుక్కై జైలుపాలైన అంతర్‌ జిల్లా దొంగ
– వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ కోటిరెడ్డి
వికారాబాద్, దర్శిని ప్రతినిధి : దొంగగా మారిన బైకు మెకానిక్ క్రైం స్టోరీ ఇది. జల్సాలకు అలవాటు పడి ఆరేండ్లుగా బైకుల దొంగతనాలు చేస్తున్నాడు. పది సార్లు జైలుకు వెళ్లి వచ్చినా బుద్ది మార్చుకోకుండా మళ్లీ బైకు దొంగతనం చేసి పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. ఇతను దొంగతనం చేసిన బైకులను ఎక్కడ దాస్తాడు. ఎలా విక్రయిస్తాడో తెలిస్తే షాక్ అవుతారు. వికారాబాద్‌ జిల్లాలో వెలుగులోకి వచ్చిన ఈసంఘటన వివరాలను శనివారం జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి ఐపీఎస్ వెల్లడించారు. జిల్లాలోని బంటారం మండలం తొర్మామిడి గ్రామానికి చెందిన గుడాల మాణిక్యం(24) గతంలో బైకు మెకానిక్‌ పనిచేసేవాడు. జల్సాలకు అలవాటు పడి వచ్చిన సంపాదన సరిపోవడం లేదని బైకుల దొంగతనానికి పాల్పడ్డాడు. 2018 నుంచి ఈ దొంగతనాలను మొదలు పెట్టారు. హోటళ్లు, హాస్టళ్లు, రైల్వే స్టేషన్‌లు, బస్‌ స్టేషన్‌లు, నిర్మానుష్య ప్రదేశాలను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడ్డాడు.

టెక్నిక్‌తో చోరీలు
గతంలో బైకు మెకానిక్‌గా పనిచేసిన అనుభవం ఉండడంతో మాణిక్యం ఈజీగా చోరీలు చేస్తాడు. బైకు హ్యాండింల్ లాక్‌ విరగ్గొట్టి తాళం లేకుండా వాహనాలను స్టార్ట్ చేసి దోచుకెళతాడు. ముందుగా సొంత ప్రాంతం బంటారంలో దొంగతనాలను ప్రారంభించి చుట్టు ప్రక్కల ప్రాంతాలు, పక్క జిల్లాలో చోరీలు చేయడం మొదలు పెట్టాడు. 2009లో మొదటిసారి జైలుకు వెళ్లి వచ్చాడు. తరువాత మొయినాబాద్, మియాపూర్, శంకర్ పల్లి , మాదాపూర్, నార్సింగ్, గోల్కొండ, కే‌పి‌హెచ్‌బి, పటాన్ చెరు, కొండాపూర్, సదాశివపేట్, సిద్దిపేట, జి‌ఆర్‌పి, మరియు ఖమ్మం పోలీస్ స్టేషన్ లలో మొత్తం కలిపి 13 కేసులలో నిందితుడుగా ఉన్నాడు. ఇందులో దాదాపుగా 10 సార్లు బైకు దొంగతనం కేసుల్లో జైలుకు వెళ్ళి వచ్చాడు. బైకు చోరీలతో పాటు మరో 3 మొబైల్ దొంగతనం కేసులు ఉన్నాయి.

ఫేక్‌ ఆర్సీలతో సేల్‌కు ప్లాన్
మాణిక్యం దొంగలించిన వాహనాలను ఫేక్ ఆర్సీలు తయారు చేయించి బైకులను సేల్‌ చేద్దామని ప్లాన్ వేసుకున్నాడు. ఇప్పటి వరకు దొంగలించిన వాహనాలను తన స్వగ్రామం లోని తన పొలం దగ్గర ఎవ్వరికి కనబడకుండా దాచేశాడు. నిందితుని పొలం దగ్గర నుండి 11 ద్విచక్ర వాహనాలను అదుపులోకి తీసుకోవడం జరిగింది.

మాణిక్యం దొంగిలించిన వాహనాల మొత్తం విలువ అందాజ 17,30,000/-లు ఉంటాయని పోలీసులు అంచనా వేశారు.

దొరికిపోయాడు ఇలా..
వికారాబాద్‌ పట్టణంలోని అంబేడ్కర్ చౌరస్తా దగ్గర శనివారం ఉదయం CCS ఇన్స్పెక్టర్ బలవంతయ్య, సిబ్బంది, వికారాబాద్ టౌన్ SI సత్యనారాయణ రాజు, సిబ్బందితో వాహనాల తనిఖీ నిర్వహిస్తున్నాడు. ఇంతలో Honda, SP125, నెంబర్ TS 08 HZ 5070 ద్విచక్ర వాహనం పై వస్తున్న మాణిక్యంను తనిఖీ చేయగా తడబడి పోయాడు. అనుమానం వచ్చిన అధికారులు అదుపులోకి తీసుకుని విచారింగా నేరాలు మొత్తం అంగీకరించాడు. నిందితుని పైన సైబరాబాద్ పరిధిలో 10 కేసులు, వికారాబాద్ మరియు సంగారెడ్డి పోలీస్ స్టేషన్ ల పరిధిలలో ఒక్కొక్క కేసులో అరెస్ట్ చేయడం జరుగుతుందని జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి వెల్లడించారు.

ఇదికూడా చదవండి…

సార్లు వస్తున్నారు..!