
నిర్లక్ష్యానికి పరాకాష్ట..!
– డంపింగ్ యార్డుపై కరువైన దృష్టి
– గేటు దాటి అటవి పరిధిలో చెత్త కుప్పలు
– మున్సిపల్ అధికారులపై విమర్శలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మున్సిపల్ పరిధిలో అధికారుల పనితీరు రోజు రోజుకు దిగజారి పోతోంది. ఉన్నత స్థాయి అధికారులు మొట్టికాయలు వేస్తే గాని సక్రమంగా పనిచేయని పరిస్థితి ఏర్పడిందని విమర్శలు వినిపిస్తున్నాయి. తాజాగా నిర్లక్ష్యానికి పరాకాష్ట అన్నట్లుగా ఓ సంఘటన చోటు చేసుకుంది. గత కొన్నేళ్లుగా డంపింగ్ యార్డుపై అధికారుల దృష్టి కరవైందని అందిరికి తెలిసిందే.

అధికారుల నిర్లక్ష్యం, పర్యవేక్షణ లోపం కారణంగా డంపింగ్ దుస్థితి దయనీయంగా తయారైంది. ఒకప్పుడు రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలిచిన డంపింగ్ యార్డును దీన స్థితికి తీసుకువచ్చిన అధికారుల నిర్లక్ష్యంపై ప్రజలు దుమ్మెత్తి పోస్తున్నారు. తడి చెత్త, పొడి చెత్త వేరువేరుగా చేసి.. ఎరువులు తయారు చేసిన డంపింగ్ యార్డును పట్టించుకోకపోవడంపై వేలేత్తి చూపించే పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం డంపింగ్ యార్డులో చెత్త కుప్పలు గుట్టలు గుట్టలుగా పేరుకుపోయాయి.

ప్రధాన గేటుకు 100 మీటర్ల దూరంలో చెత్త కుప్పలను నిల్వ చేసేవారు. ఇప్పుడు చెత్త కుప్పలు గేటు బయటకు వచ్చేశాయి. గేటు బయటి ప్రాంతం అటవి శాఖ పరిధిలోకి వస్తుందని మున్సిపల్ అధికారులే గుర్తుచేస్తున్నారు. నిర్లక్ష్యంగా హద్దుదాటుతున్న అధికారుల తీరు నిర్లక్ష్యానికి పరాకాష్టకు నిదర్శనం. చెత్త కుప్పలు గేటు దాటి బయటకు వచ్చాయంటేనే అధికారుల పర్యవేక్షణ లోపం ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికైనా అధికారులు ప్రత్యేక దృష్టి సారించి డంపింగ్ యార్డులో చెత్తను తొలగిస్తారా.. లేదా మళ్లీ ఉన్నతాధికారులతో మొట్టి కాయలు వేయించుకుంటారో వేచి చూద్దాం.

ఇదికూడా చదవండి…

