తాండూరు నాపరాతి పరిశ్రమను ఆదుకోండి

తాండూరు రాజకీయం వికారాబాద్

తాండూరు నాపరాతి పరిశ్రమను ఆదుకోండి
– కర్ణాటక తరహా రాయల్టీని అమలు చేయాలి
– రాష్ట్ర గనుల శాఖల అధికారులకు విజ్ఞప్తి
– తాండూరు స్టోన్, క్వారీ మర్చంట్స్ వెల్ఫేర్
తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్ జిల్లాలోని తాండూరు నాపరాతి పరిశ్రమను ఆదుకోవాలని తెలంగాణ రాష్ట్ర గనుల శాఖ సెక్రటరీ సురేంద్ర మోహన్, డైరెక్టర్ సుశీల్ కుమార్ లను తాండూరు స్టోన్ అసోసియేషన్, క్వారీ మర్చంట్స్ అసోసియేషన్ విజ్ఞప్తి చేసింది. సోమవారం హైదరాబాద్ లోని రాష్ట్ర గనుల శాఖ కార్యాలయంలో సెకట్రరీ. డైరెక్టర్లను అసోసియేషన్ ప్రతినిధులు కలిశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తాండూరు ప్రాంతంలో నాపరాతి, సుద్ద పరిశ్రమలపై ఆధారపడి ఎన్నో కుటుంబాలు జీవిస్తున్నాయని అన్నారు. ఈ ప్రాంతంలో అధిక రాయల్టీ వసూలు చేయడం వల్ల సుద్ద, నాపరాతి పరిశ్రమల మనుగడ కష్టతరం అవుతుందని తెలిపారు. ప్రభుత్వానికి ఆధాయం తగ్గుతుందన్నారు. ఇదే విధానం కొనసాగితే భవిష్యత్తులో పరిశ్రమలు కనుమరుగయ్యే ప్రమాదం ఉందన్నారు. కావున ప్రభుత్వం సుద్ద, నాపరాతి పరిశ్రమలను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.

కర్ణాటక తర హాలో నాపరాతి పరిశ్రమలపై రాయల్టీ విధానాన్ని అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్టోన్, క్వారీ అసోసియేషన్ల అధ్యక్షులు అబ్దుల్ రపూఫ్, అప్పూ (నయూం), ప్రతినిధులు జుబేర్ లాల, నర్సింలు, ఫయాజ్, కన్వర్, సంజీవ్, జైనోద్దీన్ తదితరులు ఉన్నారు.

ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ప్రత్యేక చొరవ
మరోవైపు తాండూరు నాపరాతి, సుద్ద పరిశ్రమల మనుగడపై స్థానిక ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ప్రత్యేక చొరవ చూపిస్తున్నారు. ఎమ్మెల్యే ఆదేశాలతోనే స్టోన్, క్వారీ అసోసియేషన్ల ప్రతినిధులు రాష్ట్ర మైన్స్ శాఖ అధికారులను కలిశారు. ఎన్నికల ముందు నాపరాతి వ్యాపారులకు ఇచ్చిన హామి మేరకు వారి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నారు.

గతంలో అసెంబ్లీలో కూడా మనోహర్ రెడ్డి నాపరాతి పరిశ్రమ ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. తాజాగా గనుల శాఖ అధికారులతో మరోసారి సమావేశం కావడంతో వ్యాపారులు మళ్లీ మంచిరోజులు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

ఇదికూడా చదవండి…

జర్నలిస్టుల కుటుంబాలను ఆదుకోవాలి