కుక్కల దాడులపై పట్టింపులేదా..!

జాతీయం తెలంగాణ హైదరాబాద్

కుక్కల దాడులపై పట్టింపులేదా..!
– ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం
– పరిష్కార మార్గాలను అన్వేషించండి
– సర్కారుకు హైకోర్టు ఆదేశం
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్రంలో చిన్నారులపై జరుగుతున్న కుక్కల దాడుల సంఘటనపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. చిన్నారులపై వీధికుక్కులు దాడులు చేస్తుంటే ఎలాంటి పట్టింపులేకుండా ఉంటారా అంటూ ప్రశ్నించింది. గురువారం ఇటీవల చోటు చేసుకుంటున్న కుక్కల దాడుల సంఘటనలపై హైకోర్టులో వాదనలు జరిగాయి. వాదనల సందర్భంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో 3.80 లక్షల వీధి కుక్కలున్నాయని ప్రభుత్వం తెలిపింది. వాటిని సంరక్షణ కేంద్రాలకు తరలించడం సాధ్యం కాదని చెప్పింది.

మరోవైపు రహదారులపై వ్యర్థాల వల్లే వాటి స్వైరవిహారం ఎక్కువైందని హైకోర్టు వ్యాఖ్యానించింది. వ్యర్థాలను నిర్మూలించి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించింది. కుక్కల దాడిని రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ అసహనం వ్యక్తం చేసింది. శునకాల బారి నుంచి పిల్లలను రక్షించేందుకు పరిష్కార మార్గాలను అన్వేషించాలని సూచించింది. వచ్చే వాయిదాకు పరిష్కార మార్గాలతో రావాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. వీధి కుక్కలను నియంత్రించడానికి స్టెరిలైజ్ చేస్తున్నామని కోర్టుకు ఏజీ తెలిపారు. స్టెరిలైజ్ ద్వారా కుక్కల దాడులను ఎలా ఆపగలరని ఉన్నత న్యాయస్థానం ప్రశ్నించింది. అంతకుముందు శునకాల దాడులను అరికట్టేందుకు 6 రాష్ట్రస్థాయి కమిటీలను ఏర్పాటు చేసినట్లు ఏజీ తెలిపారు. జంతు సంక్షేమ కమిటీలతో రాష్ట్రస్థాయి కమిటీలు సమన్వయం చేసుకొని పరిష్కారం చూపాలని హైకోర్టు సూచించింది.

ఇదికూడా చదవండి…

హస్తంలో హర్షాతిరేకం..!