ముందు ప్రారంభంపై మండిపాటు
– మంత్రి సబితారెడ్డిని అడ్డుకున్న ప్రతిపక్ష కౌన్సిలర్లు
– కొత్త మున్సిపల్ ప్రారంభంలో ఉద్రిక్తత
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు మున్సిపల్ కొత్త భవనంను ఒక రోజు ముందుగానే ప్రారంభించడంపై ప్రతిపక్ష కౌన్సిలర్లు మండిపడ్డారు. అధికారికరింగా కార్యాలయా ప్రారంభోత్సవానికి వచ్చిన మంత్రిని అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్తత వాతావరణంలో తాండూరు కొత్త మున్సిపల్ భవనం ప్రారంభమైంది. గత రెండేళ్ల క్రితం దాదాపు రూ. 3.47 కోట్లతో పట్టణంలోని లారీ పార్కింగ్ వద్ద కొత్త మున్సిపల్ భవనాన్ని నిర్మించారు. ఈ భవనాన్ని మంత్రి కేటీఆర్ చేతుల
మీదుగా ప్రారంభించాల్సి ఉండగా అనివార్యకారణాలతో తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి చేతుల మీదుగా ప్రారంభించేందుకు నిర్ణయించారు. శనివారం కార్యాలయాన్ని ప్రారంభానికి ఏర్పాట్లు చేశారు. కాని మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ కొత్త భవనంలో శుక్రవారమే పూజలు చేసి.. తన కార్యలయానికి రిబ్బన్ కట్ చేసి లాంచనంగా ప్రారంభించారు. ఆదివారం ఉదయం మంత్రి సబితారెడ్డి అధికారికంగా ప్రారంభించేందుకు హాజరయ్యారు. ఇంతలో కాంగ్రెస్ కౌన్సిలర్ ప్రభాకర్ గౌడ్, ఫ్లోర్ లీడర్లు వరాల శ్రీనివాస్‌రెడ్డి, సోమశేఖర్, ఆసీప్‌లతో పాటు బీజేపీ కౌన్సిలర్లు అంతారం లలిత, సాహు శ్రీలత, యువనాయకులు రజనీకాంత్ తదితరులు మంత్రి ప్రారంభోత్సవాన్ని అడ్డుకున్నారు. తమకు సమాచారం ఇవ్వకుండా చైర్ పర్సన్ స్వప్న కొంత మంది కౌన్సిలర్లతోనే భవనాన్ని ప్రారంభించారని, మంత్రిని నిలువరించారు. దీంతో భవన కార్యాలయ ప్రారంభోత్సవం తోపులాటకు దారితీసింది. నేతల వాగ్వివాదంతో ఉద్రిక్తత
నెలకొంది. అక్కడే ఉన్న పోలీసులు ప్రతిపక్ష కౌన్సిలర్లను అదుపుచేశారు. ఉద్రిక్తతల మద్యనే మంత్రి కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం ప్రతిపక్ష కౌన్సిలర్లు చైర్ పర్సన్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ తీవ్ర విమర్శలు చేశారు. పోలీసులు ప్రతిపక్ష కౌన్సిలర్లను కార్యాలయంలోకి అనుమతించకుండా బయటే నిలిపారు. కొద్ద సేపటి తరువాత వారిని అనుమతించడంతో వివాదం సద్దుమణిగింది.
