కళ్యాణం.. రమణీయం..!
– భూకైలాస్‌లో వైభోగంగా శివపార్వతుల కళ్యాణోత్సవం
– పల్లకి సేవను ఊరేగించిన శంకర్ నాయక్, వాసు నాయక్
– అగ్నిగుండ ప్రవేశం చేసిన వాసు పవార్ నాయక్
– బ్రహ్మోత్సవాలకు పోటెత్తిన భక్తులు
తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : తాండూరు మండలం అంతారం తాండాలో వెలసిన భూకైలాస్ ద్వాదశ జ్యోతిర్లింగాల దేవస్థానంలో శివపార్వతుల కళ్యాణోత్సవం కమీణీయం, రమణీయంగా జరిగింది. బ్రహ్మోత్సవాలు, జారత ఉత్సవాల సందర్భంగా ప్రతి యేడాది మాదిరిగానే మహాశివరాత్రి సందర్భంగా బుధవారం రాత్రి ఆలయంలో అగ్ని గుండ ప్రవేశ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో ఆలయ వ్యవస్థాపకులు వాసునాయక్ పవార్ అగ్నిప్రవేశం చేసి మొక్కులు తీర్చుకున్నారు.

గురువారం ఉదయం నుంచి శివపార్వతుల కళ్యాణోత్సవాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. శివపార్వతుల పల్లకి సేవ ఊరేగింపు నిర్వహించి, శివపార్వతుల విగ్రహాలను ఊరేగింపు నిర్వహించారు. శంకర్ పవార్ నాయక్, శాంతి పవార్, వాసుపవార్ కుటుంబ సభ్యులతో కళ్యాణోత్సవాన్ని అంగరంగవైభవంగా నిర్వహించారు. ఊరేగింపు ముందు శంకర్ నాయక్ తో పాటు శివస్వాములు, కళాకారుల కత్తి విన్యాస, నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.

ఊరేగింపులో శంకర్ నాయక్ చేసిన నృత్యాలు అక్కడి వారిని రంజింప జేశాయి. బ్రహ్మోత్సవాలు, కళ్యాణోత్సవాలలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనడంతో భూకైలాస్ భక్త జనసందోహమైంది. తాండూరుతో పాటు వికారాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్, నారాయణ పేట్, కర్ణాటక రాష్ట్రాల భక్తుల తాకిడితో కిటకిటలాడింది. భూకైలాస్లో సొరంగమార్గంలో వెలసిన నీటిగుండ ద్వాదశ జ్యోతిర్లింగాలను దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున బారులు తీరి దర్శించుకున్నారు.

అగ్నిగుండ ప్రవేశం, కళ్యాణోత్సవం, నిత్య అన్నదాన కార్యక్రమాలతో భూకైలాస్ బ్రహ్మోత్సవాలు అంగరంగవైభవంగా కొనసాగాయి. పూర్ణాహుతితో ఉత్సవాలు ముగింపు చేసినట్లు వేద పండితులు రవిశంకర్ తెలిపారు. భూ కైలాస్ బ్రహ్మోత్సవాలలో తాండూరు మార్కెట్ కమిటి మాజీ చైర్మన్ విఠల్ నాయక్ పాల్గొని మహా శివున్ని దర్శించుకున్నారు. మరోవైపు రేపటితో భూకైలాస్ లో బ్రహ్మోత్సవాల జాతర ఉత్సవాలు ముగుస్తున్నట్లు ఆలయ వ్యవస్థాపకులు వాసు పవార్ నాయక్ తెలిపారు.

ఇదికూడా చదవండి…

