రూ. 13వేల నిమ్మకాయ..!

జాతీయం తెలంగాణ రాజకీయం లైఫ్-స్టైల్ హైదరాబాద్

రూ. 13వేల నిమ్మకాయ..!
– బహిరంగ వేలంలో రికార్డు
– సోషల్ మీడియాలో వైరల్‌
దర్శిని డెస్క్ : మామూలుగా నిమ్మకాయ రూపాయిల్లోనే కొంటాం. అదే మంత్రించిందో.. పూజలందుకున్నదో అయితే వందల్లోనే కొంటాము. అయితే తమిళనాడులో శివరాత్రి సందర్భంగా నిర్వహించిన ఉత్సవాల్లో ఏర్పాటు చేసిన వేలం పాటలో ఒక నిమ్మకాయ రూ.13 వేలు పలికి అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. తమిళనాడు ఈరోడ్ జిల్లాలోని విలక్కేతి గ్రామంలో పళమ్తిన్ని కరుప్ప ఈశ్వరన్ ఆలయంలో మహా శివరాత్రి సందర్భంగా బుధవారం అర్ధరాత్రి బహిరంగంగా వేలం పాట నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆలయంలోని ప్రధాన దేవత విగ్రహంపై ఉంచిన వస్తువులను ఈ వేలం పాటలో ఉంచితే.. అక్కడికి వచ్చిన భక్తులు రికార్డు స్థాయిలో వేలం పాట పాడి వాటిని దక్కించుకుంటారు. ఈ నేపథ్యంలోనే అక్కడ దేవతపై ఉంచిన పవిత్రమైన వస్తువులు, వెండి ఉంగరం, వెండి నాణెం, నిమ్మకాయలను శివరాత్రి రోజున వేలం వేస్తారు.

అయితే ఈ వేలంలో ఒక నిమ్మకాయ రికార్డు స్థాయిలో రూ. 13 వేల ధర పలకడంతో అక్కడ ఉన్న వారంతా ఆశ్చర్యపోయారు. ప్రతీ ఏడాది నిర్వహించే ఈ వేలంలో పాల్గొనేందుకు భక్తులు భారీగా పోటీ పడుతుంటారని ఆలయ వర్గాలు శుక్రవారం వెల్లడించాయి. ఈ నిమ్మకాయను దక్కించుకునేందుకు ప్రతీ ఏడాది చాలా మంది పోటీలో ఉంటారని తెలిపాయి. ఇక తంగరాజ్ అనే భక్తులు నిమ్మకాయను రూ.13 వేలకు కొనుగోలు చేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు.

ఇక అరచలూరు గ్రామానికి చెందిన చిదంబరం అనే వ్యక్తి ఆలయ దేవతపై ఉంచిన వెండి ఉంగరాన్ని రూ.43,100కు కొనుగోలు చేశారని తెలిపారు. ఇక వెండి నాణేన్ని రూ.35 వేలకు రవికుమార్, భానుప్రియ ఇద్దరు సంయుక్తంగా దక్కించుకున్నారని పేర్కొన్నారు. అయితే ఇలాంటి వస్తువులు తమ ఇళ్లకు చేరడం వల్ల తమకు అంతా శుభం జరుగుతుందని భక్తులు విశ్వసిస్తారు. ఇక ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు అవాక్కవుతున్నారు. ఇటువంటి ఆలయ వేలం తమిళనాడుకు కొత్త కాదు. గత సంవత్సరం, విల్లుపురంలోని మురుగన్ ఆలయంలో సమర్పించబడిన తొమ్మిది నిమ్మకాయలు రూ.2.36 లక్షలకు వేలం వేయగా, ఒక నిమ్మకాయ మాత్రమే రూ.50,500 కు అమ్ముడైంది.

ఇదికూడా చదవండి…

కొడుకుతో పాటే.. తండ్రి..!