ప్రతి ఊళ్లో.. భూ భారతి సదస్సులు..!
– ముహుర్తం ఖరారు చేసిన అధికారులు
– గ్రామంలోకి రెవెన్యూ అధికారులు
వికారాబాద్, దర్శిని ప్రతినిధి : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకవచ్చిన భూ భారతిని పకడ్బందీగా అమలు చేసేందుకు వేగంగా అడుగులు వేస్తోంది. గత ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ధరణి పోర్టల్ స్థానంలో కాంగ్రెస్ ప్రభుత్వం భూ భారతిని తీసుకవచ్చిన సంగతి తెలిసిందే. ఈనెల 14న డా.బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా రాష్ట్రంలోని పలు జిల్లాలో పైలెట్ ప్రాజెక్టు ద్వారా భూ భారతి చట్టాన్ని అమలు చేస్తున్నారు.

మిగతా జిల్లాల్లో మండలాల వారిగా ఒక్కో గ్రామంలో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తూ అవగాహన కల్పిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు మండలంలో ఒకే గ్రామంలో సదస్సులు నిర్వహిస్తూ వస్తున్నారు. ఈ సదస్సులను ప్రతి మండలంలోని ప్రతి ఊళ్లో నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు వికారాబాద్ జిల్లాలో ప్రతి గ్రామంలో రెవెన్యూ సదస్సులు నిర్వహించేందుకు ముహుర్తం ఖరారు చేశారు. వికారాబాద్ జిల్లాలోని అన్ని గ్రామాల్లో వచ్చే నెల 1వ తేది నుంచి ప్రతి గ్రామంలో భూ భారతి రెవెన్యూ సదస్సులు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో పాల్గొని భూ భారతి చట్టంపై రైతులకు అవగాహన కల్పించనున్నారు. ధరణిలో జరిగిన తప్పులను ఎలా సవరించుకోవాలో..? ఇతర సమస్యలు ఎలా పరిష్కరించుకోవాలో అవగాహన కల్పిస్తారు. ఈ సదస్సులను రైతులు సద్విని యోగం చేసుకోవాలని సూచిస్తున్నారు.
ఇది కూడా చదవండి….

