ప్లాస్టిక్ నిషేధంపై కొరడా..!
– భారీగా నిషేధిత కవర్లు స్వాధీనం
– 7 రసీదులలో రూ. రూ. 16 వేలు జరిమాన
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు మున్సిపల్ అధికారులు ప్లాస్టిక్ నిషేధంపై కొరడా జులిపించారు. బుధవారం తాండూరు పట్టణంలో దాడులు నిర్వహించారు. తాండూరు ఆర్డీఓ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు మున్సిపల్ మేనేజర్ బుచ్చిబాబు, శానిటరి ఇనుస్పెక్టర్ శ్యాంసుందర్‌ల ఆధ్వర్యంలో బృందంతో కలిసి తనిఖీలు చేపట్టారు. పట్టణంలోని వెంకటేశ్వర కాలనీతో పాటు మున్సిపల్ ముందు, మోర్ సూపర్ మార్కెట్, హోటళ్లు, టిఫిన్ సెంటర్, బస్టాండ్ సమీపంలోని బేకరీ తదితర ప్రాంతాలలో తనిఖీలు నిర్వహించి నిషేధిత ప్లాస్టిక్‌ను స్వాదీనం చేసుకున్నారు. వేంకటేశ్వర కాలనీలోని ఓ నివాసంలో భారీగా ప్లాస్టిక్ కవర్లను స్వాధీనం చేసుకున్నారు. ప్లాస్టిక్ స్వాధీనం చేసుకున్న వారికి జరిమాన విధించారు. మొత్తం 7 రసీదుల ద్వారా రూ. 16వేల జరిమానను విధించారు. ఈ తనిఖీల్లో మున్సిపల్ అధికారి కృష్ణ, జవాన్లు సిహెచ్ అశోక్, బొట్టు శ్రీను, రవి, భూపతి, గురు ప్రసాద్, రమేష్, వెంకటేష్, వీరణ్ణ, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
అభ్యంతరం తెలిపిన వ్యాపారులు
మరోవైపు బుధవారం ప్రారంభమైన ప్లాస్టిక్ తనిఖీలపై పలువురు వ్యాపారులు అభ్యంతరం తెలిపారు. తాండూరు కిరాణా అసోసియేషన్ వ్యాపారులు ఆర్డీఓ, ఇంచార్జ్ కమీషనర్ అశోక్ కుమార్‌ను కలిసి మాట్లాడారు. మార్కెట్‌లో ప్లాస్టిక్ ఉత్పత్తులను నిలిపివేసేలా చూడాలన్నారు. సమాచారం లేకుండా మున్సిపల్ అధికారులు తనిఖీలు చేయడంపై వ్యక్తం చేశారు. ఆర్డీఓ జోక్యం చేసుకుని 15 రోజుల ముందే పట్టణంలో ప్లాస్టిక్ నిషేధంపై ప్రచారం నిర్వహించడం జరిగిందన్నారు. అయితే వ్యాపారులు ప్లాస్టిక్‌ను పూర్తిగా నిలిపివేసుకునేందుకు ఈ నెలాఖరు వరకు గడువు కోరారు. ఇందుకు ఆర్డీఓ, మున్సిపల్ అధికారులు స్పందిస్తూ పది రోజులు గడువు ఇస్తామని హామి ఇచ్చారు. దీంతో ప్లాస్టిక్ నిషేధంకు పది రోజులు గడువు ఇస్తున్నట్లు, ఈ పదిరోజులు ఎలాంటి తనిఖీలు చేయకుండా ప్రచారం నిర్వహిస్తామని శానిటరీ ఇనుస్పెక్టర్ శ్యాంసుందర్ తెలిపారు.
