రేషన్ తీన్మార్…!
– ఒక్కొక్కరికి 18 కిలోల బియ్యం
– ఒకేసారి మూడు నెలల రేషన్ పంపిణీ
– నిర్ణయించిన కేంద్ర ప్రభుత్వం
– రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం.. ఇదే..
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : పేదలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న రేషన్ బియ్యం పంపిణీలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాబోయే మూడు నెలలకు సంబంధించి బియ్యం కోటాను ఒకే నెలలో పంపిణీ చేయాలని సంకల్పించింది. కేంద్రం నిర్ణయంతో రాష్ట్రం కూడా ఏకీభవిస్తే వచ్చే నెలలో కుటుంబంలో ఒక్కొక్కరికి 18 కిలోల రేషన్ బియ్యం పంపిణీ జరుగుతుంది.

కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ
తెలంగాణలో రేషన్ కార్డు ఉన్న వారికి ఒకొక్కరికి 6 కిలోల చొప్పున పంపిణీ చేస్తుంది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు సన్న బియ్యం పంపిణీ చేస్తోంది. ఈ నేపథ్యంలో.. ఇంత పెద్ద మొత్తంలో బియ్యం కోటాను తక్షణమే సర్దుబాటు చేయటం సవాలుగా మారింది. సన్నబియ్యం సేకరణ, నిల్వ, పంపిణీ ప్రక్రియకు కొంత సమయం పడుతుంది. ఈ ప్రత్యేక పరిస్థితులను వివరిస్తూ.. కేంద్రానికి రాసిన లేఖలో జూన్ ఆఖరు వరకు గడువు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు.. జూన్‌లో ఒక నెల కోటా, జూలైలో రెండు నెలల కోటాను సరఫరా చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. లేదంటే జూన్ నెలాఖరులోనే మూడు నెలలకు ఒకేసారి పంపిణీ చేయనున్నట్లు తెలుస్తోంది.
మూడు నెలల పంపిణీ నిర్ణయం ఎందుకంటే…?
వర్షాకాలంలో వరదలు, ప్రకృతి విపత్తులను దృష్టిలో ఉంచుకొని తిండిగింజల నిల్వ, రవాణాలో అంతరాయాలు తలెత్తే అవకాశం ఉన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు రేషన్ పంపిణీలో కీలక ఆదేశాలు జారీ చేసింది. మూడు మాసాలకు సంబంధించిన రేషన్ బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేయాలని ఆదేశాల్లో పేర్కొంది. రాష్ట్రంలో సన్న బియ్యం పంపిణీ నేపథ్యంలో మూడు మాసాల బియ్యాన్ని సమకూర్చుకునేందుకు పౌరసరఫరాల శాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు.

ఇదికూడా చదవండి…

