మహిళల అభివృద్ధికి ప్రాధాన్యత
– 2642 స్వయం సంఘాలకు రూ.7.78 కోట్ల వడ్డీలేని రుణాలు
– మున్సిపల్లోని మహిళ సంఘాలకు రూ.6.91 కోట్ల చెక్కుల పంపిణీ
– పాల్గొన్న చీఫ్ విప్ మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : మహిళల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి ప్రాధాన్యత ఇస్తున్నారని చీఫ్ విప్ మహేందర్ రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నారు. శుక్రవారం తాండూరు పట్టణంలోని తులసీ గార్డెన్ లో మున్సిపల్ ఆధ్వర్యంలో ఇందిరా మహిళా శక్తి సంబరాలు నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి చీఫ్ విప్ మహేందర్ రెడ్డితో కలిసి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు 2642 స్వయం సంఘాలకు రూ.7.78 కోట్ల వడ్డీలేని రుణాలు, మున్సిపల్ పరిధిలోని మహిళ సంఘాలకు బ్యాంకు లింకేజీ, వడ్డీ లేని రుణాల కింద రూ.6.91 కోట్ల చెక్కులను పంపిణీ చేశారు. అదేవిధంగా సంఘాలలో ఉండి ప్రమాద వశాత్తు మరణించిన మహిళ సభ్యుల కుటుంబాలకు రూ.10 లక్షల ప్రమాద బీమా చెక్కులను అందజేశారు. అంతకుముందు ఇందిరా మహిళ శక్తి సంబరాలలో భాగంగా పలువురు మహిళ సంఘాల సభ్యులు ఏర్పాటు చేసిన మేళా ప్రదర్శనలు పరిశీలించారు.

ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ సమాజంలో మహిళలు అర్థికంగా ఎదిగినప్పుడే రాష్ట్రం, దేశం పురోగతి సాధిస్తుందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి మహిళల అభివృద్ధికి ప్రాధాన్యమిస్తున్నారని అన్నారు. గత ప్రభుత్వం 2014- 18 వరకు మహిళల మంత్రి లేకుండా పాలన చేస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం ఇద్దరు మహిళ నేతలకు మంత్రి పదవులు కల్పించిందన్నారు. అంతేకాకుండా మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతోందని అన్నారు. నూతన పెట్రోల్ బంకులు, వరి ధాన్యం కొనుగోలు, రైస్ మిల్లు ఏర్పాటు, ఆర్టీసీ బస్సులు, దుకాణాల ఏర్పాటు, బ్యాంకు లింకేజీ ద్వారా స్వయం ఉపాధి, వడ్డీలేని రుణాలు అందిస్తున్నారని తెలిపారు.

అదేవిధంగా అమ్మ ఆదర్శ కమిటీలతో పాఠశాలల అభివృద్ధి, ఏకరూప దుస్తుల పంపిణీని మహిళ సంఘాలకు అప్పగించడం జరిగిందన్నారు. రుణాలు పొందిన మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో తాండూరు మార్కెట్ కమిటి చైర్మన్ పట్లోళ్ల బాల్ రెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ధారాసింగ్, మున్సిపల్ కమీషనర్ విక్రమ్ సింహారెడ్డి, డీఆర్డీఏ పీడీ శ్రీనివాస్. జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు జానకీ, జిల్లా పీడీ రవికుమార్, మాజీ కౌన్సిలర్లు, సీనీయర్ నాయకులు, మెప్మా అధికారులు, ఆర్పీలు, మహిళ సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

