పర్మిట్ రూంలో పేకాట అడ్డా..!
– టాస్క్ ఫోర్స్ దాడులతో గుట్టు రట్టు
– పేకాట రాయుళ్ల నుంచి నగదు స్వాదీనం
తాండూరు, దర్శిని ప్రతినిధి : పర్మిట్ రూంను అడ్డాగా మార్చుకుని పేకాట ఆడుతున్న జూదరుల గుట్టును టాస్క్ ఫోర్స్ పోలీసులు రట్టు చేశారు. సోమవారం తాండూరు పట్టణంలో పేకాట రాయుళ్లను అదుపులోకి తీసుకుని పట్టణ పోలీసులకు అప్పగించారు.

తాండూరు పట్టణం చించొల్లి రోడ్డు మార్గంలో ఓ మద్యం దుకాణం వద్ద పర్మిట్ రూం ఉంది. ఈ పర్మిట్ రూంలో కొందరు పేకాట ఆడుతున్నట్లు టాస్క్ ఫోర్స్ పోలీసులకు సమాచారం అందింది. ఈ మేరకు పోలీసులు దాడులు నిర్వహించగా పేకాట ఆడుతున్న గొల్ల చెరువుకు చెందిన ఎండి షౌద్ ఖాన్, షేక్ అన్వర్ పాష, ఎండి మహబూబ్, వినాయక్ చౌరస్తాకు చెందిన షేక్ సాజిద్ లను అదుపులోకి తీసుకున్నారు.

వారి వద్ద నుంచి రూ.1470లను కూడా స్వాదీనం చేసుకున్నారు. వారిని పట్టణ పోలీసులకు అప్పగించారు. మరోవైపు తాండూరు పట్టణంలోని మద్యం దుకాణాల్లో పర్మిట్ రూంలలో అసాంఘీక కార్యకలాపాలు జరుగుతన్నట్లు తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. పర్మిట్ రూంలపై ఎక్సైజ్ శాఖ అధికారులు దృష్టిసారించక పోవడంతో ఇష్టారాజ్యం నెలకొందని విమర్శలు ఉన్నాయి. టాస్క్ ఫోర్స్ దాడులలో ఇలాంటి గుట్టు రట్టు కావడం ఆయా శాఖలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఇదికూడా చదవండి…

