తాండూరు బంద్ అయోమయం..!
– పార్టీలది, సంఘాలది తలోమాట
– పట్టణ వాసుల్లో నెలకొన్న గందరగోళం
– చివరికి తీసుకున్న నిర్ణయం ఏటంటే..?
తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణం బంద్ ప్రజలను అయోమయానికి గురిచేస్తోంది. బంద్ విషయంలో తలోమాట బయటకు రావడంతో పట్టణ వాసులు ఆయోమయానికి గురవుతున్నారు. చేవేళ్ల మండలం మీర్జాగూడ వద్ద జరిగిన టిప్పర్ లారీ, ఆర్టీసీ బస్సు ప్రమాదంలో తాండూరుకు చెందిన సుమారు 14 మంది మృతి చెందడంతో తాండూరు మొత్తం ఆందోళకు గురవుతోంది.

ఈ నేపథ్యంలో మంగళవారం తాండూరు డెవలప్ మెంట్ ఫోరం ఆధ్వర్యంలో పట్టణంలోని విలియమూన్ చౌరస్తా వద్ద ఆందోళన చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ ఆందోళన తరువాత బీఆర్ఎస్ పార్టీకి చెందిన జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజుగౌడ్ బుధవారం తాండూరు బంద్‌కు పిలుపునిస్తున్నట్లు ప్రకటించారు. అందరు స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొనాలని విజ్ఞప్తి కూడా చేశారు. పార్టీల పరంగా అన్ని పార్టీల ఆధ్వర్యంలో నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు.

తీరా సాయంత్రానికి ఓ సమావేశంలో తాండూరు డెవలప్ మెంట్ ఫోరం ప్రతినిధులు బుధవారం నాటి తాండూరు బంద్‌కు తమకు సంబంధం లేదని తెలిపింది. తాండూరు బంద్ చేపట్టేందుకు నిర్ణయం తీసుకున్నప్పటికి బుధవారం కార్తీక పౌర్ణమి, గురునానక్ జయంతి సందర్భంగా బంద్‌ను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో పట్టణ వాసుల్లో తాండూరు బంద్‌పై ఆయోమయం ఏర్పడింది. బంద్ ఉన్నట్లా, లేనట్లా అని అయోమయానికి గురయ్యారు. మరోవైపు సాయంత్రం జిల్లా గ్రంథాలయ సంస్ధ మాజీ చైర్మన్ రాజుగౌడ్ ఓ వీడియోలో మాట్లాడుతూ పార్టీల పరంగా బుధవారం తాండూరు బంద్ కొనసాగుతుందని స్పష్టం చేశారు.

పార్టీలకతీతంగా, వ్యాపారులు, సంఘాల ప్రతినిధులు స్వచ్ఛందంగా తాండూరు బంద్‌లో పాల్గొని సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఇదిలా ఉంటే తాండూరులో జరిగిన ఆందోళన వద్ద జరిగిన నాటకీయ పరిణామాలు చర్చనీయాంశంగా మారాయి. ఈ క్రమంలో తాండూరు బంద్‌కు పిలుపునివ్వడంతో ఈ బంద్ విషయంలో పట్టణ వాసులు భిన్నప్రాభియాలను వ్యక్తం చేస్తున్నారు. మరి రేపటి బంద్ విజయవంతంపై అందరి దృష్టి పడింది.

ఇదికూడా చదవండి…

