గౌతాపూర్ లో పొలిటికల్ హైడ్రామా..!

తాండూరు రాజకీయం వికారాబాద్

గౌతాపూర్ లో పొలిటికల్ హైడ్రామా..!
– నేతలతో కలిసి గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యే
– ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని బీఆర్ఎస్ నేతల ఆందోళన
– సబ్ కలెక్టర్ కు బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థి ఫిర్యాదు
– పరామర్శించేందుకు వెళ్లానని అన్న ఎమ్మెల్యే
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మండలంలో గౌతాపూర్ గ్రామంలో రాజకీయ పరిణామాలు పొలిటికల్ హైడ్రామాను తలపించాయి. తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గౌతాపూర్ గ్రామానికి నేతలతో కలిసి రావడం వివాదాస్పదంగా మారింది. ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తూ కాంగ్రెస్ పార్టీ తరుపు అభ్యర్థికి ప్రచారం చేస్తున్నారని బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. ఈ సంఘటన బుధవారం జరిగింది.

గౌతాపూర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ మద్దతుతో జన్నె సృజన పోటీ చేస్తుండగా.. బీఆర్ఎస్ పార్టీ మద్దతుతో సుజాత రాజప్ప గౌడ్ పోటీ చేస్తున్నారు. మంగళవారం సాయంత్రం నాటికి ఎన్నికల ప్రచారం ముగిసింది. అయితే బుధవారం ఉదయం తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పార్టీ నేతలు, అనుచరులతో కలిసి గౌతాపూర్ గ్రామానికి వచ్చారు. గ్రామంలోని మేయిన్ రోడ్డు నుంచి ఊరేగింపుగా రావడం గమనించిన బీఆర్ఎస్ పార్టీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. గ్రామ పెద్దలు రాంరెడ్డి, బీజేపీ నాయకులు సాయిరెడ్డి నివాసం వద్ద ఎమ్మెల్యే ఉండగా నేతలు అక్కడికి చేరుకున్నారు. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు నినాదాలు చేశారు.

పోలీసులు కూడా అక్కడే ఉండడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ప్రచారం కోసమే వచ్చారని బీఆర్ఎస్ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. కొద్ది సేపటి తరువాత ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గ్రామం నుంచి వెళ్లిపోయారు. ఈ సంఘటనపై బీఆర్ఎస్ సర్పంచు అభ్యర్థి సుజాత రాజప్ప గౌడ్ తాండూరు సబ్ కలెక్టర్ ఉమా శంకర్ ప్రసాద్, తాండూరు ఎంపీడీఓ విశ్వప్రసాద్ లకు ఫిర్యాదు చేశారు. గ్రామంలో ర్యాలి నిర్వహించడమే కాకుండా సుమారు 500ల మందితో సమావేశం నిర్వహించారని ఆరోపించారు. అధికారంలో ఉన్నామని దౌర్జన్యం ప్రదర్శించారని ఆరోపించారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

పరామర్శకు వెళ్లా. బీఆర్ఎస్ దౌర్జన్యం : ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి
గౌతాపూర్ గ్రామంలో జరిగిన వివాదాస్పద పరిస్థితిపై ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి స్పందించారు. గౌతాపూర్ గ్రామానికి చెందిన రాంరెడ్డి ఆరోగ్య పరిస్థితి బాగాలేదని తెలిసి పరామర్శించేందుకు వెళ్లాని చెప్పుకొచ్చారు. దానికి బీఆర్ఎస్ నేతలు రాద్దాంతం చేయడం వికృత సంస్కృతిని విమర్శించారు. గత ఐదేళ్లు పాలనలో ఉండి.. ఇప్పుడు ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే ఆగడాలు సృష్టిస్తున్నారని అన్నారు. ఈ విషయాలను ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయాలే బీఆర్ఎస్ కు” బుద్ధిచెబుతాయని అన్నారు.

ఇదికూడా చదవండి…

కాంగ్రెస్‌లో ‘క్రాస్’ ఎటువైపో..!