తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్ర సరిహద్దు వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలంలో గుర్తించిన గుర్తుతెలియని మృతదేహంపై పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. మంగళవారం ఉదయం నవాంద్గి – హల్కోడ రహదారిలో నిప్పంటించిన గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైన విషయం తెలిసిందే. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన బషీరాబాద్ ఎస్ఐ విద్యాచరణ్ రెడ్డి తాండూరు డీఎస్పీ లక్ష్మీనారాయణ, రూరల్ సీఐ జలంధర్ రెడ్డికి సమాచారం అందించారు.
దీంతో డీఎస్సీ, రూరల్ సీఐలు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతున్ని హత్య చేసిన తరువాతే కాల్చేసి ఉంటారని ప్రాథమిక నిర్దారణకు వచ్చారు. అయితే మృతుడు తెలంగాణకు చెందిన వాడా.. కర్ణాటకకు చెందిన వాడా.. అనే విషయాలపై విచారణ ప్రారంభించారు. కర్ణాటక పోలీసులకు సమాచారం అందించి మిస్సింగ్ కేసులపై ఆరా తీశారు. అంతేకాకుండా కర్ణాటక పరిధిలోని పలు ప్రాంతాల్లో సీసీ కెమెరాలను కూడ పరిశీలించారు. త్వరలోనే కేసును చేధిస్తామని పోలీసులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
