తాండూరులో భారీగా గంజాయి పట్టివేత..!

క్రైం తాండూరు రాజకీయం

తాండూరులో భారీగా గంజాయి పట్టివేత..!
– 52.8 కిలోల ప్యాకెట్లు స్వాధీనం
– ముగ్గురు ఒడిశా ముఠా అరెస్టు
– సరుకు రవాణాపై ఆరా
– వివరాలు వెల్లడించిన జిల్లా ఎక్సైజ్ సూపరిండెంట్
తాండూరు, దర్శిని ప్రతినిధి : గంజాయి అక్రమ రవాణాపై ఎక్సైజ్‌ అధికారులు ఉక్కుపాదం మోపారు.

తాండూరు రైల్వే స్టేషన్‌ సమీపంలోని ద్విచక్ర వాహనాల పార్కింగ్‌ వద్ద నిర్వహించిన తనిఖీల్లో 52.8 కిలోల ఎండు గంజాయి పట్టుబడింది. నాలుగు ట్రాలీ బ్యాగుల్లో తరలిస్తున్న ఒడిశా ముఠాను అరెస్టు చేశారు. ఈ గంజాయి విలువ సుమారు రూ.13.20 లక్షలు ఉంటుందని జిల్లా ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు.

బుధవారం తాండూరు ఎక్సైజ్ కార్యాలయంలో ఆయన మీడియాతో కేసు వివరాలు వెల్లడించారు. తాండూరు మీదుగా గంజాయి తరలిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం అందడంతో STF హైదరాబాద్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ రంగారెడ్డి, DTF వికారాబాద్‌, స్థానిక ఎక్సైజ్‌ అధికారులు సమన్వయంతో మంగళవారం రాత్రి తాండూరు రైల్వే స్టేషన్ సమీపంలో తనిఖీలు చేపట్టారు. రైల్వే స్టేషన్‌ సమీపంలోని ద్విచక్ర వాహనాల పార్కింగ్‌ వద్ద నాలుగు ట్రాలీ బ్యాగులతో అనుమానాస్పదంగా కనిపించిన ముగ్గురిని అదుపులోకి తీసుకుని తనిఖీ చేశారు.

ఒడిశా రాష్ట్రంకు చెందిన మధు ప్రధాన్‌, శివా నాయక్‌, నీలు మండల్‌గా గుర్తించారు. ట్రాలీ బ్యాగుల్లో 52.8కిలోల ప్యాకెట్లు గుర్తించారు. వీటి విలువ సుమారు రూ. 13 లక్షలు ఉండవచ్చని తెలిపారు. అయితే గంజాయిని రవాణా చేసేందుకు ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున కూలీగా తీసుకున్నట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైనట్లు తెలిపారు.
నిందితుల నుంచి గంజాయిని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి రిమాండుకు తరలిస్తున్నట్లు చెప్పారు.

గంజాయి ఎక్కడి నుంచి తీసుకొచ్చారు.. తాండూరులో ఎవరికి అప్పగించాల్సి ఉంది.. ఈ రవాణా వెనుక ఇంకా ఎవరెవరి ప్రమేయం ఉంది.. అనే అంశాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్టీఎఫ్ ఎస్సైలు వెంకటేష్, మంజుల, డీటీఎఫ్ సీఐ శ్రీనివాస్, తాండూరు ఎక్సైజ్ సీఐ, ఎస్సైలు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

అభివృద్ధికి పక్కా ప్రణాళికలు..!