బ‌బుల్ గ‌మ్‌తో క‌రోనాకు క‌ళ్లెం..!

ఆరోగ్యం జాతీయం తెలంగాణ

బ‌బుల్ గ‌మ్‌తో క‌రోనాకు క‌ళ్లెం..!
– కోవిద్ వ్యాప్తిని అడ్డుకునే బబుల్ గమ్
– అమెరికా పెన్సిల్వేనియా శాస్త్రవేత్తల తయారీ
ద‌ర్శిని డెస్క్ : బ‌బుల్ గ‌మ్‌తో క‌రోనా వ్యాప్తికి క‌ల్లెం వేయొచ్చు.. అవును మీరు చ‌దివింది నిజ‌మే. వైర‌స్ ఉచ్చును అడ్డుకునే బబుల్ గ‌మ్‌పై అమెరికాలోని పెన్సిల్వేనియా విశ్వ విద్యాల‌య శాస్త్ర‌వేత్త‌లు ప‌రిశోధ‌న‌లు చేస్తున్నారు. దీని సాయంతో నోటిలోని వైరస్ మొత్తాన్ని తగ్గించవచ్చని, వ్యాప్తిని అరికట్టవచ్చని అంటున్నారు. ఈ చూయింగ్ గమ్ ఆధారంగా లాలాజలంలో ఉండే వైరస్ లోడ్ ను తగ్గించి వైరస్ వ్యాప్తికి కళ్లెం వేసే ప్రయత్నం చేస్తున్నారు.

నోటిలో సార్స్-కోవ్-2 లాలాజల గ్రంథుల్లో రెట్టింపు అవుతుంది. దీంతో కరోనా సోకిన రోగి నుంచి దగ్గినా, తుమ్మినా, లేదా మాట్లాడినప్పుడు వైరస్ బయటకు వచ్చి ఇతరులకు సంక్రమిస్తుంది. ఈ అంశంపై హెన్నీ డేనియల్ నేతృత్వంలోని శాస్త్రవేత్తలు పరిశోధన సాగించారు. ఇందు కోసం ఆయన సొంత ల్యాబ్ లో ప్రత్యేక ప్రోటీన్ ను వృద్ధి చేశారు. వీటితో పాటు ప్రోటీన్ ఆధారిత చూయింగ్ గమ్ ను ఉపయోగించి దంతాలపై ఏర్పడే పూత నివారణపై జరిపిన పరిశోధన‌లో పాల్గొని స‌మీక్షించారు.

మొక్కల్లో వృద్ధి చేసిన ఏస్2 గ్రాహకాలను చూయింగ్ గమ్ పూతగా వాడారు. దీని ద్వారా లాలాజలంలో కరోనా వైరస్ ను తగ్గించవచ్చా అనే దానిని పరిశీలించారు. వాటిని కరోనా సోకిన వ్యక్తులతో పాటు ఇతరులకు ఇచ్చి వారి నోటి నుంచి నమూనాలను సేకరించి పరీక్షించారు. ప్ర‌స్తుత ప్రాథ‌మిక ప‌రిశోధ‌న‌ల్లో ఏస్2 గ్రాహకాలు కరోనాకు కారణమైన వైరస్ ని తటస్థీకరిస్తున్నట్లు నిర్ధారణకు వచ్చారు. ఏస్2 గ్రాహకాలు వైరస్ ని అడ్డుకుంటున్నట్లు గుర్తించారు. ప‌రిశోధ‌న‌లు విజ‌య‌వంతం కావడంతో క్లినికల్ ట్రయల్స్ నిర్వహించేందుకు అనుమతి కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు వెల్లడైంది.

మ‌రోవైపు ప్రపంచాన్ని వణికిస్తున్న ఒమిక్రాన్ వంటి వివిధ కోవిడ్ వేరియంట్‌లలో చూయింగ్ గమ్ ప్రభావవంతంగా పని చేస్తుందా? లేదా? అనేది తెలియాల్సి ఉంది. ఇకపోతే ఈ చూయింగ్ గమ్‌ పై మరింతగా పరిశోధనలు జరగాల్సి ఉందని శాస్త్రవేత్తలు తెలిపారు.