వరి పండించి నష్టపోవద్దు
– ఆరుతడి పంటలపై దృష్టిసారించాలి
– వికారాబాద్ జిల్లా కలెక్టర్ కె.నిఖిల
పెద్దేముల్, దర్శిని ప్రతినిధి : యాసంగిలో రైతులు వరి పండించి నష్టపోకుండా ఆరుతడి పంటపై దృష్టిసారించాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ కె.నిఖిల సూచించారు. బుధవారం పెద్దముల్ మండలం, మంబాపూర్ గ్రామంలోని రైస్ మిల్లులను కలెక్టర్ సందర్శించారు. అక్కడ ఉన్న రైతులతో కలెక్టర్ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం ఎఫ్‌సీఐ ద్వారా ఇకనుండి వరి కొనదని తేల్చి చెప్పిందని గుర్తుచేశారు. కావున రైతులు యాసంగిలో వరి పండించి నష్టపోవద్దని అన్నారు. వరి ధాన్యానికి బదులు ఆరుతడి పంటలు సాగు చేసుకోవాలని సూచించారు. అరుతడి పంటలైన పెసర, మినుములు, నువ్వులు, వేరుశనగ, జొన్నలు లాంటి పంటలు సాగుచేసుకోవాలన్నారు. ఆరు తడి పంటలతో అధిక లాభాలు పొందవచ్చన్నారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు వచ్చే చిరుధాన్యాలు కూడా పండించుకోవాలని సూచించారు. రైతుల కోసం ఆరుతడి పంటలకు సంబంధించిన విత్తనాలు కూడా అందుబాటులో ఉంచడం జరిగిందన్నారు. కలెక్టర్ వెంట తాండూర్ ఆర్డీఓ అశోక్ కుమార్, స్పెషల్ ఆఫీసర్ హన్మంత్ రావు, జిల్లా వ్యవసాయ అధికారి గోపాల్, వ్యవసాయ సహాయ సంచాలకులు శంకర్ రాథోడ్, మండల వ్యవసాయ అధికారి బాల కోటేశ్వర్ రావు, డా. ప్రవీణ్ సైంటిస్ట్ తదితరులు ఉన్నారు.
