శరణు.. శరణు.. శరణు..!
– అయ్యప్ప నామస్మరణతో మార్మోగిన ఆలయం
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరులోని అయ్యప్పస్వామి ఆలయం అయ్యప్ప శరణు ఘోషతో మార్మోగింది.
శుక్రవారం తాండూరు చైతన్య జూనియర్ కళాశాల, శ్రీ సాయి మేధా పాఠశాలల కరస్పాండెంట్ పెరుమాళ్ల వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అయ్యప్ప స్వామి పడిపూజ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. అయ్యప్ప గురుస్వాములు ముందుండి పూజను జరిపించారు. పూజలో పాల్గొన్న వెంకట్ రెడ్డి అయ్యప్ప స్వామి విగ్రహానికి పంచామ్రుతాలతో అభిషేకం చేశారు.
అనంతరం జరిగిన మెట్ల పూజ, స్వామి వారి పల్లకిసేవ కార్యక్రమాలు కమణీయంగా జరిగాయి. పూజ సమయంలో స్వాములు శరణమప్ప.. అయ్యప్పా.., స్వామియే శరణం అయ్యప్ప అంటూ స్వామి నామస్మరణతో మార్మోగింది. పూజా కార్యక్రమంలో భాగంగా గురుస్వాములు పాడిన అయ్యప్ప గీతాలతో ఆలయ ప్రాగణం భక్తిభావంతో పొంగిపొర్లింది. భక్తుల పేటతుళ్లై నృత్యాలు ఆకట్టుకున్నాయి.
అనంతరం వెంకట్ రెడ్డి స్వాములకు, భక్తులకు సద్ది నిర్వహించారు. అయ్యప్ప స్వామి ఆలయంలో నిర్వహించిన పడిపూజకు తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్, వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీపా నర్సింలు, మార్కెట్ కమిటి చైర్మన్ విఠల్ నాయక్, వైస్ చైర్మన్ వెంకట్ రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ కోట్రిక విజయలక్ష్మీ, ఫ్లోర్ లీడర్ శోభారాణి, సీనియర్ కౌన్సిలర్ పట్లోళ్ల నీరజా బాల్‌రెడ్డి, కౌన్సిలర్ మంకాల రాఘవేందర్, మాజీ కౌన్సిలర్ పరిమళ, తాండూరు డీఎస్పీ లక్ష్మీనారాయణ, సీఐలు జలంధర్ రెడ్డి, రాజేందర్ రెడ్డిలతో పాటు వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ప్రజా ప్రతినిధులు, పట్టణ ప్రముఖులు, వ్యాపారులు తదితరులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామి వారిని దర్శించుకున్నారు.
