రోగులకు ఊపిరి..!
– ఆక్సీజన్ ప్లాంట్ల ట్రయల్ రన్ ప్రయోగాలు
– జిల్లా ఆసుపత్రిలో త్వరలో అందుబాటులోకి
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు ప్రాంతంలోని నిరుపేదలకు కార్పోరేట్ స్థాయి వైద్య సేవలందిస్తున్న జిల్లా ఆసుపత్రిలో కరోనా, ఆస్తమా రోగులకు త్వరలో ఊపిరందించే సేవలు అందుబాటులోకి రాబోతున్నాయి. పీఎం కేర్ నిధుల నుంచి ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన ఆక్సీజన్ ప్లాంట్ల ప్రయోగాలు తుదిదశకు చేరుకున్నాయి. దేశంలో కల్లోలం సృష్టించిన కరోనా మొదటి దశ, రెండో దశలో అనేక మంది ఊపిరందక ప్రాణాలను విడిచారు. రోగులకు, పేదలకు ఊపిరందించాలనే ఉద్దేశంతో భారత ప్రభుత్వం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రులలో ఆక్సీజన్ ప్లాంట్లను ఏర్పాటు చేయాలని సంకల్పించింది. ఇందుకోసం కేంద్రం పీఏం కేర్ నిధులను వెచ్చించి ఆక్సీజన్ ప్లాంట్లను మంజూరు చేసింది. ఇందులో భాగంగా గత ఆగస్టు నెలలో జిల్లా ఆసుపత్రితో పాటు హైదరాబాద్ రోడ్డు మార్గంలోని మాతా శిశు ఆసుపత్రికి పీఎం కేర్ నిధుల నుంచి 1000 లీటర్ల సామర్థ్యం కలిగిన ఆక్సీజన్ ప్లాంట్లు చేరుకున్నాయి. ఈ ఆక్సీజన్ ప్లాంట్ల కోసం ఇప్పటికే ప్రత్యేక షెడ్లను కూడ ఏర్పాటు చేశారు. ఆగస్టు తరువాత నుంచి ఆక్సీజన్ సరఫరాపై ప్రయోగాలు చేపట్టారు. గత సెప్టెంబర్ మాసంలో ఆక్సీజన్ ప్లాంట్ల ఇన్‌స్టాలేషన్ పూర్తయ్యింది. అప్పట్లో ప్రయోగాలు చేపట్టగా లీకేజీ సమస్యలతో పాటు ఇన్‌స్టాలేషన్ సమస్యలు తలెత్తాయి.
జిల్లా ఆసుపత్రిలో ట్రయల్ రన్
జిల్లా ఆసుపత్రిలో రోగులకు ఊపిరి అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే ఆసుపత్రిలోని వివిధ వార్డుల్లో ఆక్సీజన్ పైపులైన్, ఇతర వసతులను పూర్తి చేశారు.
వైద్య ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సోమవారం జిల్లా ఆసుపత్రిలో ట్రయల్ రన్ చేపట్టారు. జిల్లా ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ రవిశంకర్ టెక్నిషియన్లతో కలిసి ప్రతి వార్డులో ఆక్సీజన్ సరఫరా పనులను పరిశీలించారు. ముందులాగా ఎక్కడైన లీకేజీ సమస్యలు ఉన్నాయా లేదా అనే విషయాలను పరిశిలించారు.
త్వరలో అందుబాటులోకి
ఆక్సీజన్ సేవలను అందించడంలో భాగంగా ఆసుపత్రిలోని ప్రసూతి, అత్యవసరం, డయాలిస్, చిన్నారులు, పెద్దలు, మహిళల వార్డు తదితర విభాగాలలో ఆక్సీజన్ ఫైపులైన్‌లను ఏర్పాటు చేశారు.
ప్రస్తుతం ఆక్సీజన్ సరఫరా ప్రయోగాలు మంచి ఫలితాలు ఇవ్వడంతో త్వరలోనే ఊపిరందించే సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఆసుపత్రిలో సేవలు అందుబాటులోకి వస్తే ఆస్తమాతో పాటు కరోనా రోగులకు ఆక్సీజన్ ఇబ్బందులు దూరమవుతాయి.