ద‌మ్ముంటే రాజీనామా చేయ్

తాండూరు తెలంగాణ రాజకీయం వికారాబాద్

ద‌మ్ముంటే రాజీనామా చేయ్
– రేవంత్ వ‌ర్సెస్ మ‌ల్లారెడ్డి ఇష్యూపై కేటీఆర్ హాట్ కామెంట్స్
ద‌ర్శిని ప్ర‌తినిధి: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై మంత్రి మ‌ల్లారెడ్డి చేసిన స‌వాల్‌కు ఆయ‌న స్పందించాల‌ని మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు. రేవంత్‌ వర్సెస్ మంత్రి మల్లారెడ్డి ఇష్యూపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రీ కేటీఆర్ స్పందించారు. శుక్రవారం నాడు తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన కేటీఆర్.. కొందరు వ్యక్తులు గత ఏడేళ్ల నుంచి తమ నాయకుడు కేసీఆర్‌పై నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి అని కూడా ఆలోచించకుండా బట్టేబాజ్ అని, ఏవేవో పరుష వ్యాఖ్యలు చేస్తున్నారని నిప్పులు చెరిగారు. వారి మాటలు హద్దులు దాటడంతోనే మంత్రి మల్లారెడ్డి స్పందించారని అన్నారు. అవతలి వ్యక్తుల మాటలను బట్టే మల్లారెడ్డి రియాక్ట్ అయ్యారని, యాక్షన్ ను బట్టి రియాక్షన్ ఉంటుందని ఉద్ఘాటించారు.

ఇదే సమయంలో రేవంత్ రెడ్డిపై మంత్రి కేటీఆర్ నిప్పులు చెరిగారు. డబ్బుల సంచులతో పట్టుబడిన వ్యక్తిని పార్టీకి అధ్యక్షుడు చేశారు.. ఆయన మాట తీరు ఎలా ఉందో ఆయన్ను ఎందుకు ప్రశ్నంచరని అన్నారు. మంత్రి మల్లారెడ్డి వయసుకు కూడా గౌరవం ఇవ్వకుండా చెత్త మాటలు మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. ‘‘ఈ చిలక మనదే.. పలుకులు మాత్రం వేరే వ్యక్తివి. కాంగ్రెస్ పార్టీని చంద్రబాబు తీసేసుకున్నాడు.’’ అంటూ రేవంత్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. మంత్రి మల్లారెడ్డి సవాల్‌పై రేవంత్ రెడ్డి స్పందించాలన్నారు. రేవంత్ రెడ్డికి నిజంగా దమ్ముంటే రాజీనామా చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.