సజావుగా నిమజ్జనం చేసుకుందాం

తాండూరు రాజకీయం వికారాబాద్

సజావుగా నిమజ్జనం చేసుకుందాం
– ప్రశాంతంగా జరిగేందుకు అందరు సహకరించాలి
– శోభాయాత్ర ఫిర్యాదుల కోసం ప్రత్యేక కంట్రోల్ రూం
– డీజే సౌండ్లకు అనుమతులు లేవు
– వికారాబాద్ జిల్లా ఎస్పీ నంద్యాల కోటి రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : వినాయక నిమజ్జనం సజావుగా నిర్వహించేందుకు అందరు సమన్వయంతో పనిచేయాలని వికారాబాద్ జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి అన్నారు. వినాయక. నిమజ్జనం, శోభాయాత్రను పురస్కరించుకుని బుధవారం తాండూరు డీఎస్పీ శేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో పట్టణంలోని దుర్గా గ్రాండ్యూర్ ఫంక్షన్ హాల్ లో డివిజన్ స్థాయి శాంతి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డితో పాటు ఆర్డీఓ శ్రీనివాసరావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజుగౌడ్, మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్, వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీపా నర్సింలు, హిందూ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి పట్లోళ్ల నర్సింలు తదితరులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఎస్పీ కోటిరెడ్డి మాట్లాడుతూ తాండూరు పట్టణానికి సంబంధించి యాలాల మండలం కోకట్ కాగ్నాలో వినాయక నిమజ్జనానికి ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. నిమజ్జనం రోజున నిర్వహించే శోభాయాత్ర, వినాయకుల ఊరేగింపుకు పోలీసు శాఖతో పాటు మున్సిపల్, రెవెన్యూ, వైద్యం, విద్యుత్, ఆర్అండ్బి తదితర శాఖల అధికారులు వారి శాఖల తరుపున ఏర్పాట్లు చేయాలన్నారు. ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా శోభాయాత్రలో కంట్రోల్ రూం ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. దీంతో పాటు అడిషనల్ ఎస్పీ, డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలు కానిస్టేబుళ్లతో భారీ బందోబస్తు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

ఊరేగింపులో డీజే సౌండ్ కు అనుమతులు లేవని స్పష్టం చేశారు. బ్యాండ్ బాజాలతో, ఇతర వాయిద్యాలతో ఊరేగింపును చేసుకోవాలన్నారు. ప్రజలు ఎలాంటి ఘర్షణకు పాల్పడకుండా, పుకార్లను నమ్మకుండా ఊరేగింపు ప్రశాంతంగా జరిగేలా సహకరించాలన్నారు. అదేవిధంగా జిల్లా గ్రంథాలయం సంస్థ చైర్మన్ రాజుగౌడ్, మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ లు మాట్లాడుతూ నిమజ్జన ఉత్సవాలు ప్రశాంతంగా జరిగేలా సహకరిస్తామన్నారు. హిందు ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి నర్సింలు మాట్లాడుతూ కోకట్ లో జరిగే నిమజ్జన ఉత్సవాలకు ఏర్పాట్లు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో తాండూరు జెడ్పీటీసీ గౌడి మంజుల, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు అప్పూ (నయూం), కాంగ్రెస్ పట్టణ మాజీ అధ్యక్షులు ప్రభాకర్ గౌడ్, ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు కమల్ అతహర్, ఖుర్షిద్ హుస్సేన్, సీఐలు రాజేందర్ రెడ్డి, రాంబాబు, ఎస్ ఐలు, వివిధ పార్టీల నాయకులు, సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

పేద విద్యార్థుల సేవలో..!