
దొంగోడి.. ఆట ..!
– పోలీసులను తప్పుదోవ పట్టించే యత్నం
– తెలివిగా ప్లాన్ చేసిన పాత దొంగ
– తాండూరులో జరిగిన భారీ చోరీలో ట్విస్ట్
– చోరీ చేధనలో చెమటోడుస్తున్న పోలీసులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : ఓ దొంగతనం కేసు విషయంలో పోలీసులు పట్టుకొచ్చిన దొంగ వారికే మస్కా కొట్టే స్కెచ్ వేశాడు. ఖాకీలను తప్పుదోవ పట్టించేందుకు యత్నించాడు. ఆ దొంగ ఎంత తెలివిగా ప్లాన్ చేసినా పోలీసులు వలలో పడలేదు. సమయ స్పూర్తిగా వ్యవహరించడంతో దొంగ ప్లాన్ బెడిసి కొట్టింది. తాండూరులో నమోదైన భారీ చోరీ కేసును చేధించేందుకు ఓ వైపు చెమటోడుస్తూనే.. మరో వైపు ఎంతో నిజాయితీగా పనిచేస్తున్నారని తెలిపేందుకు ఈ సంఘటన ఉదహరణ. అసలేం జరిగిందంటే..

తాండూరు పట్టణం సాయిపూర్ కు చెందిన పట్లోళ్ల వెంకటేష్, సరళ దంపతులు ఇంట్లో ఈ యేడాది ఫిబ్రవరిలో చోరీ జరిగింది. ఆ నెల 6న కుటుంబ సభ్యులతో కలిసి ధారూర్ మండలం నాగసానిపల్లిలో అక్క కుమారుడు పెళ్లి కోసం ఇంటికి తాళం వేసి వెళ్లారు. పెళ్లి కార్యక్రమాలు ముగించుకుని రెండు రోజుల తరువాత నివాసానికి చేరుకున్నారు. అప్పటికే ఇంటి తాళాలు పగలగొట్టి ఉండడంతో ఆందోళన గురయ్యారు. ఇంట్లోకి వెళ్లి చూడగా వస్తువులన్నీ చిందరవందరుగా పడి ఉండడంతో అంతా పరిశీలించగా ఇంట్లో ఉన్న సుమారు 40 తులాల బంగారం, ఆభరణాలు అపహరణకు గురైనట్లు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. అప్పట్లో ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది.

దొంగ దొరికాడని..
అప్పట్లో కేసు నమోదు చేసుకున్న పోలీసులు చేధించేందుకు ఎన్నో కష్టాలు పడుతున్నారు. క్లూస్ టీం ఇచ్చిన ఆధారాలు, సీసీ కెమెరాలో నమోదైన దృశ్యాలతో కొందరు దొంగలపై నిఘా పెట్టారు. కొన్ని రోజుల క్రితం ఓ దొంగను అదుపులోకి తీసుకుని విచారించారు. ఇక్కడే ఆ దొంగ పోలీసులకు ట్విస్ట్ ఇచ్చాడు. దొంగతనం తానే చేశాడని నేరం అంగీకరించాడు. తనతో మరో వ్యక్తి కూడా ఉన్నాడని తెలిపారు. అప్పట్లో ఇద్దరు వ్యక్తులే చోరీకి పాల్పడ్డారని పోలీసులు గుర్తించారు. అదుపులోకి తీసుకున్న దొంగ కూడా ఇద్దరు వ్యక్తులం చేశామని చెప్పడంతో పోలీసులు దొంగ దొరికాడని ఊపిరి పీల్చుకున్నాడు. కాని సదరు దొంగ ఇచ్చిన సమాచారంపై పోలీసులకు అమానం కలిగింది. తనతో పాటు మరో దొంగ ఉన్నాడని చెప్పిన వ్యక్తి గురించి పోలీసులు ఆరా తీశారు. ఇక్కడే పోలీసులకు మైండ్ బ్లాక్ అయిపోయింది. ఆ దొంగ చెప్పిన మరో వ్యక్తి.. తాండూరులో చోరీ జరిగిన రోజు జైలులో ఉన్నట్లు గుర్తించారు. దీంతో కథ మళ్లీ మొదటికి వచ్చింది. ఈ వివరాలు విశ్వసనీయ సమాచారం ద్వారా అందాయి.
మరోవైపు తాండూరులో జరిగిన ఈ భారీ చోరీ కేసును చేధించేందుకు ఎంతో కష్టపడుతున్నారు. నిద్రహారాలు మాని కేసు పరిష్కరించేందుకు స్పెషల్ ఫోకస్ పెట్టారు. ముఖ్యంగా పట్టణ సీఐ సంతోష్ కుమార్ కేసును చేధించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు.

ఇదికూడ చదవండి….

