ఢీకొట్టింది బైక్.. దెబ్బతిన్నది భవిష్యత్తు..!
– ప్రమాదాన్ని హత్యాయత్నగా మలిచిన పోలీసులు
– విచారణ పూర్తికాకముందే రిమాండ్ కు
– ఉద్యోగ అవకాశం కోల్పోయిన యువకుడు
– పెద్దేముల్ పోలీసుల తీరుపై ఎస్పీకి తండ్రి ఫిర్యాదు
పెద్దేముల్, దర్శిని ప్రతినిధి : ఒక సాధారణ రోడ్డు ప్రమాదం ఓ యువకుడి జీవితాన్ని అనూహ్య మలుపు తిప్పిందని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదవశాత్తు జరిగిన ఘటనలో సరైన విచారణ లేకుండానే హత్యాయత్నం కేసు నమోదు చేసి రిమాండ్కు పంపడంతో పోస్టల్ శాఖ ఉద్యోగ ఇంటర్వ్యూను కోల్పోయి భవిష్యత్తు అంధకారంలో పడిందని వారు వాపోతున్నారు.

ఈ ఘటనపై పెద్దేముల్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ ప్రశాంత్ వర్ధన్ వ్యవహారశైలిపై విచారణ జరిపించాలని బాధితుడి తండ్రి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. మంబాపూర్ గ్రామానికి చెందిన మర్పల్లి శ్రీనివాస్ కుమారుడు అనిర్వేష్ (20) ఈ నెల 2న గ్రామంలో స్కూటీపై వెళ్తుండగా, వెనుక నుంచి వచ్చిన బుల్లెట్ మోటార్ సైకిల్ ఢీకొట్టిందని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఇద్దరూ కిందపడగా, బుల్లెట్ నడుపుతున్న జాఫర్ చేతికి స్వల్ప ఫ్రాక్చర్ అయినట్లు పేర్కొన్నారు.

ఈ ఘటనపై జాఫర్ సోదరుడు మోహిజ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, సంఘటనపై సమగ్ర విచారణ, సాక్ష్యాల పరిశీలన చేపట్టకుండా అనిర్వేష్పై హత్యాయత్నం కేసు నమోదు చేసి ఈ నెల 8న రిమాండ్కు పంపించారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఇది ఉద్దేశపూర్వకంగా జరిగిన ఘటన కాదని, సాధారణ రోడ్డు ప్రమాదమేనని వివరించినా పోలీసులు పట్టించుకోలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. రిమాండ్ కారణంగా ఈ నెల 9న జరగాల్సిన పోస్టల్ శాఖ ఉద్యోగ ఇంటర్వ్యూకు అనిర్వేష్ హాజరుకాలేకపోయాడని, దీంతో అతని ఉద్యోగ అవకాశంతో పాటు విద్యా భవిష్యత్తు కూడా దెబ్బతిన్నట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు.

ఒక కేసు కారణంగా యువకుడి జీవితమే అనిశ్చితిలో పడిందని కన్నీటి పర్యంతమవుతున్నారు. మరోవైపు గాయపడిన జాఫర్, ఫిర్యాదుదారుడు మోహిజ్, వారి కుటుంబ సభ్యులు కూడా ఇది ప్రమాదవశాత్తు జరిగిన ఘటన మాత్రమేనని, ఎలాంటి ఉద్దేశపూర్వక చర్య కాదని చెబుతున్నారని బాధితుడి తండ్రి ఫిర్యాదులో పేర్కొన్నారు. అవసరమైతే వారిని కూడా అధికారుల ఎదుట హాజరుపరచడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఈ నేపథ్యంలో కేసు నమోదు విధానం, దర్యాప్తు, రిమాండ్ ప్రక్రియపై నిష్పాక్షిక విచారణ జరిపి, విధి నిర్వహణలో లోపాలు లేదా అధికార దుర్వినియోగం జరిగినట్లు తేలితే సంబంధిత అధికారిపై శాఖాపరమైన, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీని మర్పల్లి శ్రీనివాస్ కోరారు.


