మళ్లీ రాజీవ్ స్వగృహ ప్లాట్ల వేలం..!
– ధర నిర్ణయం తరువాత తేది ప్రకటన
– ఈ సారి వేలంపై లబ్దిదారుల ఆశలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరులోని రాజీవ్ స్వగృహ ఓపెన్ ప్లాట్లు మరోసారి వేలంకు సిద్దమవుతున్నాయి. హైదరాబాద్ రోడ్డు మార్గం యాలాల మండలం కోకట్ గ్రామ పంచాయతీ పరిధిలోకి వచ్చే సర్వే నెం.52లో 221 ఎకరాలను రాజీవ్ స్వగృహకు కేటాయించిన విషయం తెలిసిందే. మనోహటౌన్షిప్ పేరుతో ఏర్పాటు చేసిన స్థలంలో మొత్తం ప్లాట్లు 292 ఏర్పాటు చేశారు. ఇందులో 173 లే అవుట్ పూర్తికాగా 16 ఇండ్ల నిర్మాణం పూర్తయ్యింది. ఇంకా అసంపూర్తిగా 100, ఓపెన్ ప్లాట్లు 176 ఉన్నాయి. వాటికి వేలం వేయగా 65 ప్లాట్లు మిగిలాయి. వీటిని మరోసారి వేలం వేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.
ఇదిలా ఉండగా . గడిచిన రెండేళ్లుగా రేటు తగ్గించాలని డిమాండ్ వ్యక్తమవుతోంది. తాండూరు పట్టణ శివారులో ఉందని ఇక్కడ ప్రైవేట్‌గా ప్లాట్లకు సైతం అంత ధర లేదని, రూ.6 నుంచి 7వేల వరకూ ధర నిర్ణయించాలని ప్రజలు పలుమార్లు నిర్వహించిన సమావేశాలలో కోరారు. ప్లాట్లకు ధర ఎక్కువగా ఉన్నందున కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపడం లేదని పలువురు వాపోయారు. వాయిదాలు కూడా పెంచాలని, ఉద్యోగులైతే ఈఎంఐ అవకాశం కల్పించాలని కోరారు.
కమిటీ ఏర్పాటు
రాజీవ్ స్వగృహ ప్లాట్ల వేలంపై కమీటీలను ఏర్పాటు చేయబోతున్నారు. కమిటీ చైర్మన్‌గా కలెక్టర్, ఆర్అండ్‌బీ సూపరింటెండెంట్ ఇంజనీర్, డీటీసీసీ లేదా సమీప పట్టణానికి సంబంధించిన టౌన్లోనింగ్ అధికారులు సభ్యులుగా, టీఆర్ఎస్సీఎల్ జనరల్ మేనేజర్ను కన్వీనర్‌లతో ఈ కమిటీలను నియమించారు. ఇందుకు సంబంధించి జిల్లా స్థాయి కమిటీ ధరలు, తేదీలను నిర్ణయించిన తర్వాత విస్తృత ప్రచారం కల్పించి వేలం వేసేందుకు చర్యలు చేపట్టారు.
ఇది కూడా చదవండి..

