ఇంటర్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి
– ఈసారి పరీక్షల్లో కొత్త నిబంధనలు
– పరీక్షా కేంద్రాలకు ప్రత్యేక అధికారులు
– ఆదేశాలు జారీ చేసిన బోర్డు, జిల్లా కలెక్టర్
– రేపటి నుంచే ఇంటర్ పరీక్షలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్ జిల్లాలో ఇంటర్ పరీక్షలకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్త చేసింది. జిల్లాలోని తాండూరులో ఇంటర్ పరీక్షలను దృష్టిలో ఉంచుకుని తాండూరు పట్టణంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 2, చైతన్య జూనియర్ కాలేజీ, సింధు బాలికల జూనియర్ కళాశాల, సిద్ధార్థ జూనియర్ కళాశాల, అంబేద్కర్ ఒకేషనల్ జూనియర్ కళాశాలతో పాటు హైదరాబాద్ రోడ్డు మార్గంలోని టీఎంఆర్జేజేపీ, టీఎస్బ్ల్యూఆర్ కళాశాలలో మొత్తం 8 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. టీఎంఆర్ జేసీ, టీఎస్ఈబ్ల్యూఆర్ కాలేజీలలో ఒకేషనల్ విద్యార్థులకు మాత్రమే పరీక్షా కేంద్రాలుగా కేటాయించారు.
మొదటి, ద్వితీయ సంవత్సరాలకు సంబంధించి దాదాపు 4500ల మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఇందులో జనరల్ విభాగంలో సుమారు 3వేల మంది ఉండగా ఒకేషనల్ విభాగంలో దాదాపు 1500ల మంది విద్యార్థులు ఉన్నారు. ఆయా పరీక్షా కేంద్రాల్లో తాగునీరు, విద్యుత్, వైద్య సేవలను అందుబాటులో ఉంచుతున్నారు. దీంతో పాటు పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్, సమీప జిరాక్స్ కేంద్రాలపై ఆంక్షలు విధించారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల పరీక్ష సమయం ఉండగా విద్యార్థులకు గంట ముందు పరీక్షా కేంద్రాలకు చేరుకొ వాల్సి ఉంటుందని. నిమిషం ఆలస్యమైనా అనుమతులు ఉండవని అధికారులు స్పష్టం చేశారు.
కొత్త నిబంధనలు
ఈసారి జరిగే ఇంటర్ పరీక్షల్లో ఎలాంటి నిర్లక్ష్యానికి తావివ్వకుండా పకడ్బందీ చర్యలు చేపట్టింది. ఈ మేరకు ఇంటర్ బోర్డు, వికారాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి ఉత్తర్వులను జారీ చేశారు. పట్టణంలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాలకు తాండూరు తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్, రెవెన్యూ విభాగాలకు చెందిన అధికారులను ప్రత్యేక అధికారులుగా నియమించినట్లు వెల్లడించారు. అదేవిధంగా సీసీ కెమెరాల నిఘాలోనే పరీక్షలు కొనసాగుతుండగా పరీక్షా కేంద్రాల వద్దకు పర్యవేక్షణ అధికారులు, ఇన్విజిలేటర్స్, ఇతర సిబ్బంది ఎవ్వరికీ కూడా సెల్ ఫోన్ అనుమతి లేదని నిషేధం విధించారు. మరోవైపు విద్యార్థులు మాల్ ప్రాక్టీసుకు పాల్పడితే డిబార్ చేయడంతో పాటు క్రిమినల్ కేసులు నమోదు చేసే అవకాశం ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు. ఇందులో ఎవరైనా అధికారులు కూడా భాగస్వాములుగా తేలితే వారిపై కూడా చర్యలు తప్పవంటున్నారు.
కేంద్రాలను పరిశీలించిన తహసీల్దార్ తారాసింగ్
మరోవైపు నేటి నుంచి ప్రారంభమవుతున్న ఇంటర్ పరీక్షలను దృష్టిలో ఉంచుకుని తాండూరు పరిధిలో ఏర్పాటు చేసిన కేంద్రాలను తాండూరు తహసీల్దార్ తారాసింగ్ సందర్శించారు.

ఆయా కేంద్రాలు నిర్వహకులతో పరీక్షా ఏర్పాట్లపై ఆరా తీశారు. ఎలాంటి అవకతవకలు లేకుండా ఉండడంతో పాటు పకడ్బందీ ఏర్పాట్లు తీసుకోవాలని ఆదేశించారు.
పకడ్బందీ ఏర్పాట్లు : కస్టోడియన్ మల్లినాథప్ప, కృష్ణయ్య
ఇంటర్ పరీక్షలకు కోసం పకడ్బందీ ఏర్పాట్లు చేయడం జరిగిందని తాండూరు కస్టోడియన్ మల్లినాథప్ప, కృష్ణయ్యలు తెలిపారు.

పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు పాత నిబంధనలు వర్తిస్తాయన్నారు. నిమిషం లేటైనా పరీక్షకు అనుమతి ఉండదని స్పష్టం చేశారు. గంట, ముందే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందని, జిరాక్స్ కేంద్రాలను మూసివేయాలనే ఉత్తర్వులు ఉన్నాయని తెలిపారు. విద్యార్థులు ఒత్తిడికి గురికాకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలని సూచించారు.
ఇది కూడా చదవండి..

