చలికాలం.. గుండె పదిలం
– రోజూ ఈ నియమాలు పాటించండి
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి: అన్ని కాలాల్లో ఎలా ఉన్నా.. చలికాలం మాత్రం మనిషి గుండె పనితీరుపై ప్రభావం చూపిస్తుంది. చిన్నారులు మొదలుకొని వృద్ధుల వరకు గుండెపై శ్రద్ద వహించాల్సిన కాలం ఇది. శీతాకాలంలో చలి ఎక్కువైతే గుండెపై ఒత్తిడి పెరుగుతుంది. రక్తనాళాలు కుంచించుకుపోతాయి. రక్తపోటు పెరుగుదలతో పాటు స్ట్రోక్, గుండెపోటు ప్రమాదాన్ని కూడా పెంచుతుందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
రక్తం గడ్డ గడితే ప్రమాదమే
తీవ్రమైన చలి సమయంలో రక్తం మందంగా, జిగటగా మారుతుంది. ఇది రక్తం గడ్డకట్టడాన్ని సులభతరం చేస్తుంది. చాలా స్ట్రోక్స్ రక్తం గడ్డకట్టడం వల్లనే సంభవిస్తాయి. శీతాకాలంలో జలుబు, ఫ్లూ నుంచి రక్షణ పొందడానికి రోగనిరోధక
వ్యవస్థ రక్త స్థాయిలు అనేక రెట్లు పెరుగుతాయి. దీనివల్ల ధమనుల గోడలపై ప్లేక్స్ పేరుకుపోతాయి. ఇది గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతుంది. శీతాకాలంలో రక్త నాళాలు కుంచించుకుపోతాయి. ఇరుకైన రక్తనాళాల గుండా రక్తం వెళ్లడానికి ఎక్కువ ఒత్తిడి పెరుగుతుంది. ఈ కారణంగా రక్తపోటు వచ్చే అవకాశాలుంటాయి.
ఈ నియమాలు పాటించడం ముఖ్యం
అయితే శీతాకాలంలో గుండెకు సంబంధించిన సమస్యలను తగ్గించుకునేందుకు ఎన్నో మార్గాలున్నాయి. వీటిలో ముఖ్యంగా నిత్యం 20 నిమిషాల సూర్యకాంతిలో ఉండటం, ఆహారంలో 30 శాతం ప్రొటీన్లు తీసుకోవడం, రోజూ 40 నిమిషాలు పాటు వ్యాయామం చేయడం వంటివి. వీటి వల్ల ఎంతో ఉపయోగం ఉంటుంది. వీటిని పాటించడం వల్ల చలికాలంలో గుండెపోటు నుంచి రక్షించుకోవచ్చని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు.
ప్రతి రోజు కనీసం 20 నిమిషాల పాటు సూర్యకాంతిలో ఉన్నట్లయితే గుండెకు సంబంధిత వ్యాధుల నుంచి దూరం కావచ్చంటున్నారు. సూర్యరశ్మి కారణంగా శరీరం శరీరంలో యాంటీబాడీలను ఎక్కువగా తయారవుతాయి. ఈ సూర్యకాంతి మనకు వాపు, అధిక రక్తపోటును కూడా తగ్గిస్తుంది. మెదడు పని చేసే సామర్థ్యాన్ని మెరుగు పరుస్తుంది. అందువల్ల నిత్యం 20 నిమిషాలపాటు ఉదయం ఎండలో కూర్చోవడం అలవాటు చేసుకోవడం మంచిదంటున్నారు నిపుణులు.