ఆర్జీకే ప్రమాదంలో కొత్త మలుపు
– పాతకక్ష్యలతో హత్యాయత్నం అంటూ ఫిర్యాదు
– సమగ్ర విచారణ జరుపుతున్న పోలీసులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం రాజీవ్ కాలనీ సమీపంలో శనివారం రాత్రి చోటు చేసుకున్న బైకును ఢీకొన్న కారు ఘటన కొత్త మలుపుతీసుకుంది. ప్రమాదంలో గాయపడిన బాధితులు తమపై హత్యాయత్నానికి పాల్పడ్డారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ సంఘటన చర్చనీయాంశంగా మారింది. రాజీవ్ కాలనీకి చెందిన జబ్బార్ బైకుపై సోఫియాన్, సోహెల్‌లు వెళుతుంగా వెనుక వచ్చిన కారు ఢీకొనడంతో ప్రమాదం జరిగిందని అందరికి తెలిసిన విషయమే. ఈ ప్రమాదంలో జబ్బార్ మరణించారు. అయితే ఈ ప్రమాదం వెనుక హత్యాయత్న ప్రయత్నం జరిగినట్లుగా తెలుస్తోంది. ఇందుకు బలం చేకూరుస్తూ ప్రమాదంలో గాయపడిన సోఫియాన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కారులో ఉన్న ఇస్మాయిల్, మోయిన్‌లు తమపై కావాలనే కారు ఢీకొట్టి గాయపరిచారని చెప్పినట్లు సమాచారం. తమ మద్య పాతకక్ష్యలే ఇందుకు కారణమని వెల్లడించినట్లు ప్రచారం సాగింది. దీంతో పోలీసులు మరింత లోతుగా దర్యాప్తుకు సిద్దమయ్యారు. తాండూరు రూరల్ సీఐ జలంధర్ రెడ్డి సమగ్ర విచారణ జరుపుతున్నట్లు యాలాల ఎస్ఐ సురేష్ పేర్కొనడం గమనార్హం.
