న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు
– నేటి నుంచి జనవరి 2 వరకు అమలు
– ఆదేశాలు జారీ చేసిన కేసీఆర్ ప్రభుత్వం
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్రంలో న్యూయర్ వేడుకలపై ప్రభుత్వం ఆంక్షలకు సిద్దమైంది. కరోనా నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకుంది. రాష్ట్రంలో ఒమిక్రాన్ వ్యాప్తి పెరుగుతోందని.. అందుకే క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు విధించాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. రెండు, మూడు రోజుల్లో ఉత్తర్వులు ఇవ్వాలని సూచించింది.
దీంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. న్యూ ఇయర్ వేడుకల్లో కొవిడ్ నిబంధనలు పాటించాలని సూచించింది. ఇవాళ్టి నుండి జవనరి 2 వరకు ఆంక్షలు వర్తిస్తాయని స్పష్టం చేసింది. వేడుకల్లో సోషల్ డిస్టెన్స్, మాస్కులు ధరించాలని ఆదేశాల్లో పేర్కొంది. అదేవిధంగా డిసెంబర్ 31 నుండి జనవరి 2 వరకు ర్యాలీలు, బహిరంగ సభలపై నిషేధం ఉంటుందని, కొత్త వేరియంట్ ఒమిక్రాన్ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం సూచించింది. పబ్లిక్ ఈవెంట్స్ లో భౌతిక దూరం తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రతి ఒక్కరు మాస్క్ పెట్టుకోకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

