పిల్లల టీకా రిజిస్ట్రేషన్ ఈజీ
– 15 నుంచి 18 ఏండ్ల వారికి కోవాగ్జీన్
– పాత పద్దతిలోనే నమోదు
దర్శిని డెస్క్ : వచ్చే నెల 1నుంచి పిల్లల టీకాకు సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. వచ్చేనెల 3 నుంచి 15 – 18 ఏండ్ల పిల్లలకు టీకా పంపిణీ కార్యక్రమం ప్రారంభాన్ని దృష్టిలో ఉంచుకుని మార్గదర్శకాలను విడుదల చేసింది. పిల్లలకు అందించనున్న టీకా వివరాలతో పాటు స్లాట్ బుక్ చేసుకునే విధానాన్ని వివరించింది. 2007, ఆ తర్వాత జన్మించిన పిల్లలంతా టీకా తీసుకునేందుకు అర్హులని స్పష్టం చేసింది.
రిజిస్ట్రేషన్ చేసుకోవడం ఇలా
గతంలో పెద్దల కోసం కోవిన్ యాప్ లేదా వెబ్‌సైట్‌లో ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారో అదే విధానం పిల్లలకు వర్తిస్తుందని ఆరోగ్య శాఖ తెలిపింది. ఇప్పటికే ఉన్న అకౌంట్ ద్వారా చేసుకోవచ్చని, లేదా కొత్త మొబైల్ నెంబర్‌తో కొత్త అకౌంట్‌ను రూపొందించి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని తెలిపారు. ముందుగా యాఫ్/వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఫోన్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఫోన్‌కు వచ్చిన ఓటీపీని ఎంటర్ చేశాకా నెంబర్‌ను నిర్దారించుకోవాలి. తరువాత వచ్చే రిజిస్ట్రేషన్ పేజీలో పేరు, పుట్టిన తేది, జెండర్ తదితర వివరాలను నమోదు చేయాలి. 18 ఏండ్ల లోపు వారికి పాన్, ఓటర్ కార్డులు ఉండవు కాబట్టి ఆధార్ కార్డును ఐడీ ప్రూఫ్‌గా ఎంచుకోవాలి. ఆధార్ కార్డు లేకపోతే పదో తరగతి స్టూడెంట్ ఐడీ నెంబర్ ఇవ్వచ్చు. రిజిస్ట్రేషన్ పూర్తయిన తరువాత స్లాట్ బుక్ చేసుకోవచ్చు.
అందరికి కోవాగ్జీన్ టీకానే
అయితే పిల్లలకు ఇచ్చే వ్యాక్సిన్‌లో జైడస్ క్యాడిలా గతంలోనే అమోదం పొందగా జాతీయ ఔషద నియంత్రణ సంస్థ(డీసీజీఐ) కోవాగ్జీన్ వ్యాక్సిన్‌కు ఆమోదం తెలిపింది. రెండు వ్యాక్సీన్‌లకు అమోదం లభించడంతో ఈ రెండింటిలో ఏ టీకాను పంపిణీ చేయాలనే దానిపై సందిగ్దత నెలకొంది. ఎట్టకేలకు కేంద్ర ఆరోగ్య శాఖ కోవాగ్జీన్ పంపిణీకి మొగ్గుచూపింది. 15 నుంచి 18 ఏండ్ల వారందరికి కోవాగ్జీన్ టీకా మాత్రమే ఇవ్వాలని స్పష్టం చేసింది.