పైలెట్ ప్రగతి దూకుడు..!
– తాండూరు అభివృద్ధికి ట్రిపుల్ జీవోలు
– ప్రధాన కార్యదర్శి ద్వారా అందుకున్న ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి
– 45 ఎకరాల్లో జిన్ గుర్తిలో పారిశ్రామిక వాడ
– అంతారం వద్ద 12 ఎకరాల్లో ఆటోనగర్
– మార్కెట్ యార్డుకు 30 ఎకరాల కేటాయింపు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు నియోజకవర్గ అభివృద్ధికి ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి దూకుడు పెంచారు. తాండూరు చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించే ఘట్టానికి శ్రీకారం చుట్టేందుకు సిద్దమయ్యారు. ఇందుకోసం ఒకేసారి ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి త్రిపుల్ జీవోలను సాధించారు. గురువారం రాత్రి జీవోలను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ స్వయంగా ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి అందుకున్నారు. ఈ మూడు జీవోలతో తాండూరు ప్రాంత అభివృద్ధి కొత్త పుంతలు తొక్కడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి మాట్లాడుతూ.. ఇచ్చిన మాటను తప్పను.. మడమ తిప్పను అని పేర్కొన్నారు. ట్రిపుల్ జీవోలు తాండూరు చరిత్రను తిరగరాస్తాయని అన్నారు. తాండూరు అభివృద్ధి మాటలలో కాదు.. చేతలలో చూపిస్తానని పేర్కొన్నారు. ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలను నెరవేరుస్తానని ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి పేర్కొన్నారు. తాండూరు ప్రజల ఆశీస్సులతోనే ట్రిపుల్ జీవోలు వచ్చాయని అన్నారు. ప్రభుత్వం మూడు జీవోల జారీపై ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ గారికి కృతజ్ఞతలు తెలిపారు.
జిన్ గుర్తి వద్ద పారిశ్రామిక వాడ..జీవో 64 జారీ
—————————————————
తాండూరులోని నాపరాయి పరిశ్రమలను ఒక చోటకు చేర్చడానికి తాండూరు మండలం జిన్ గుర్తి వద్ద నాపరాయి పారిశ్రామిక వాడను ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ మేరకు భూమిని కేటాయించాలని జిల్లా కలెక్టర్ నిఖిలకు ఎమ్మెల్యే లేఖ రాశారు. ఎమ్మెల్యే లేఖపై జిల్లా కలెక్టర్ గత ఏడాది అక్టోబర్ 12న జిన్ గుర్తి వద్ద సర్వేనెంబర్ 206లోని ప్రభుత్వ భూమిని సర్వే చేసి నివేదిక అందజేశారు. పారిశ్రామికవాడకు మొత్తం 295 ఎకరాలను కేటాయించాలని నివేదికలో కలెక్టర్ కోరారు. అయితే మొదటి విడతలో తెలంగాణ పరిశ్రమల మౌలిక సదుపాయాల కల్పన సంస్థ(టిఎస్ ఐఐసి)కు సర్వేనెంబర్ 206లో 45 ఎకరాలను కేటాయిస్తూ జీవో 64ను జారీ చేసింది. భూసేకరణ నిమిత్తం ప్రభుత్వం నిధులను సైతం జారీ చేసింది. ఎకరం భూమిని రూ.12 లక్షలకు సేకరించాలని సైతం జీవోలో పేర్కొంది.
ఆటోనగర్ కు 12 ఎకరాలు..జీవో 65 జారీ
———————————————-
తాండూరు పట్టణ నడిబొడ్డులో ఉన్న లారీ పార్కింగ్ ను పట్టణ శివారులోకి తరలించాలని ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి భావించి పట్టణ శివారులోని అంతారం గ్రామం వద్ద భూమిని కేటాయించాలని కోరారు. జిల్లా కలెక్టర్ అంతారం వద్ద సర్వేనెంబర్ 58లో 15 ఎకరాలను కేటాయించాలని ప్రభుత్వంకు నివేదించారు. ఈ సర్వేనెంబర్ లో 12 ఎకరాలను లారీ పార్కింగ్ (ఆటోనగర్)కు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణ పరిశ్రమల మౌలిక సదుపాయాల కల్పన సంస్థ(టిఎస్ ఐఐసి)కు అంతారం గ్రామం వద్ద సర్వేనెంబర్ 58లోని 12 ఎకరాల భూమిని కేటాయించాలని జీవో 65 జారీ చేసింది. భూసేకరణకు నిధులను సైతం కేటాయించారు. ఎకరం భూమిని రూ.25 లక్షల చొప్పున వెచ్చించి సేకరించాలని జీవోలో సూచించారు.
మార్కెట్ యార్డుకు 30 ఎకరాలు..జీవో 66 జారీ
—————————————————–
తాండూరు పట్టణంలోని నెహ్రూ గంజ్ లోని ఇరుకైన ప్రదేశంలో ఉన్న వ్యవసాయ మార్కెట్ యార్డును విస్తరించాలని చాలా కాలంగా భావిస్తున్నారు. తాండూరు పట్టణ శివారులో మార్కెట్ యార్డుకు భూమిని కేటాయిస్తానని ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి పలుమార్లు హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే సూచన మేరకు జిల్లా కలెక్టర్ ఈ ఏడాది మార్చి 2న పట్టణ శివారులోని కోకట్ రెవెన్యూ పరిధిలోకి వచ్చే ప్రభుత్వ భూమిని సర్వే చేసి వ్యవసాయ మార్కెట్ యార్డుకు 30 ఎకరాలను కేటాయించాలని ప్రభుత్వంకు నివేదించారు. కోకట్ పరిధిలోకి వచ్చే ప్రభుత్వ భూమిని తాండూరు వ్యవసాయ మార్కెట్ యార్డుకు కేటాయిస్తూ జీవో 66 జారీ అయ్యింది. మొత్తం 30 ఎకరాలను కొత్త మార్కెట్ యార్డు నిర్మాణంకు కేటాయించారు. ఈ భూమికి మార్కెట్ విలువ చెల్లించి సేకరించాలని జీవోలో స్పష్టం చేశారు. ఎకరం భూమిని రూ.30 లక్షలు వెచ్చించి సేకరించాలని సూచించారు.



