తాగునీటిపై స్పెషల్ ఫోకస్..!
– ఎద్దడి ప్రత్యామ్నాయమే లక్ష్యం
– రూ.100 కోట్లతో సరఫరా వ్యవస్థల మరమ్మత్తులు
– వికారాబాద్ జిల్లాకు రూ.3.54 కోట్ల నిధులు
– తాండూరు కాగ్నా నీటి మళ్లింపుపై అపోహలు వద్దు
– కోడంగల్, యాలాల మండల గ్రామాలకు సామర్థ్యం పెంపు
– గ్రామీణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా
– తాండూరు కాగ్నా నది పంపుహౌస్ సరఫరాపై సమీక్ష
తాండూరు, దర్శిని ప్రతినిధి : రాష్ట్ర వ్యాప్తంగా తాగునీటి సరఫరా విషయంలో సర్కారు స్పెషల్ ఫోకస్ పెట్టిందని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానీయా అన్నారు. శనివారం వి కారాబాద్ జిల్లాలోని తాండూరు కాగ్నానది పంపుహౌస్ ను సందీప్ కుమార్ సుల్తానీయా వికారాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి, అడిషనల్ కలెక్టర్ రాహుల్ శర్మ, మిషన్ భగీరథ ఉన్నతాధికారులతో కలిసి సందర్శించారు. కాగ్నా పంపుహౌస్ నుంచి ఏయే గ్రామాలకు తాగునీరు సరఫరా అవుతుందనే విషయాలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా మీడియా సమావేశంలో సందీప్ కుమార్ సుల్తానియా మాట్లాడుతూ వేసవిని దృష్టిలో ఉంచుకుని తెలంగాణ ప్రభుత్వం తాగునీటి ఎద్దడిపై స్పెషల్ ఫోకస్ పెట్టిందన్నారు. తాగునీటి సమస్య తలెత్తకుండా క్షేత్రస్థాయిలో జాగ్రత్తలు తీసుకుంటుందన్నారు. ఎక్కడైనా తాగునీటి ఎద్దడి ఏర్పడితే యుద్ధ ప్రాతిపదికన ప్రత్యామ్నాయ చర్యలు తీసుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేయిస్తుందన్నారు. చేతి పంపులు, బోరు మోటార్లు, పైపులైన్ మరమ్మత్తులు చేపట్టి నీటి పునరుద్ధరణపై ప్రాధాన్యం ఇస్తుందన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా రూ.100 కోట్లతో 19,605 చేతి పంపులు, 14708 సింగల్ ఫేస్, 5హెచ్ సీ పంపుసెట్లు, 605 మంచినీటి బావులు, 662 ఇంట్రా పైపులైన్ మరమ్మత్తులు చేయడం జరిగిందన్నారు. ఇందులో భాగంగా వికారాబాద్ జిల్లాకు రూ.3.54 కోట్ల నిధులను మంజూరు చేయడం జరిగిందన్నారు. ఈ నిధులతో 1044 పంపుసెట్లు. 495 చేతి పంపులను మరమ్మత్తులను చేయడం జరిగిందన్నారు. తాగునీటి ఎద్దడి ఎక్కడ ఏర్పడినా ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటాన్నారు. ఇందుకోసం జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేయడం జరిగిందన్నారు. అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా 23975 గ్రామాలకు 37002 ఓహెచ్ఎర్ ట్యాంకుల ద్వారా ప్రతి ఇంటింటికి మిషన్ భగీరథ నీటిని అందిస్తున్నామన్నారు. ఈ ట్యాంకులు క్లోరినేషన్ చేసే చర్యలు తీసుకుంటున్నామన్నారు.
అదేవిధంగా వేసవిలో పశువుల కోసం పశువుల నీటి తొట్టిలను ఏర్పాటు చేయాలని సూచించడం జరిగిందన్నారు. మరోవైపు తాండూరు కాగ్నానది నుంచి కోడంగల్. యాలాల మండలంలోని గ్రామాలకు 2.50 ఎమ్మెల్జీ సామర్థ్యాన్ని పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. నీటి స్వచ్ఛతను తెలుసుకునేందుకు ప్రతి గ్రామ పంచాయతీకి క్లోరో స్కోప్ కిట్లను పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. కాగ్నానది నుంది నీటి మల్లింపు చేస్తున్నట్లు వస్తున్న అపోహలను సమ్మొద్దన్నారు.
అనంతరం పరిగి మండలంలోని 135 ఎమ్మెల్లిని సందర్శించి ఏయే గ్రామాలకు తాగునీరు సరఫరా అవుతుందని తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మిషన్ భగీరథ ఇంజనీర్ ఇన్ చీఫ్ కృపాకర్ రెడ్డి, చీఫ్ ఇంజనీర్ చెన్నారెడ్డి, ఎస్ఈ ఆంజనేయులు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ లు బాబు శ్రీనివాస్ , చల్మారెడ్డి, వెంకటరమణ, జెడ్పి సీఈఓ సుధీర్, డిపిఓ జయసుధ, డి ఆర్ డి ఓ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
ఇదికూడా చదవండి…

