ఏడాదిలోనే నిరంతర అభివృద్ధి..!

తాండూరు రాజకీయం వికారాబాద్

ఏడాదిలోనే నిరంతర అభివృద్ధి..!
– రాబోయే రోజుల్లో తాండూరు రూపు మారుస్తాం
– చిలుక వాగు అభివృద్ధికి రూ.25 కోట్లతో టెండర్లు
– కాగ్నా పంపుహౌస్ కోసం రూ.35 కోట్ల ప్రతిపాదనలు
– అమృత్ 2.0 కింద రూ.27 కోట్లతో అభివృద్ధి పనులు
– కౌన్సిల్ సమావేశంలో ప్రతిపక్షాల ఉనికి రాజకీయాలు
– తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి
– అందరి సహాకారంతో మున్సిపల్ అభివృద్ధి
– మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్
– లాస్ట్ మీటింగులో బీఆర్ఎస్ కౌన్సిలర్ల నిరసన
– రసాభసాగా ముగిసిన మున్సిపల్ చివరి సమావేశం
తాండూరు, దర్శిని ప్రతినిధి : గత నాలుగేళ్ల కన్న చివరి ఏడాది కాలంలోనే తాండూరు మున్సిపల్ అభివృద్ధి జరిగిందని, రాబోయే రోజుల్లో తాండూరు రూపు రేఖలు మారడం ఖాయమని స్థానిక ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు. శనివారం తాండూరు మున్సిపల్ కార్యాలయంలో పాలక వర్గ చివరి సమావేశం చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యాలయంలో ఆఖరి సమావేశం సుమారు 5 గంటల పాటు సుదీర్ఘంగా కొనసాగింది. మొత్తం 38 ఎజెండా అంశాలపై చర్చించారు. సమావేశం అనంతరం ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ తో కలిసి మాట్లాడారు.

కౌన్సిల్ సమావేశంలో స్వపక్షం కన్నా ప్రతిపక్షానికే మాట్లాడేందుకు అవకాశం కల్పించడం జరిగిందని తెలిపారు. కాని గత నాలుగేళ్లుగా వ్యవహరించిన రాద్దాంత ధోరణిని కొనసాగించారని విమర్శించారు. ప్రజా సమస్యలు, అభివృద్ధిపై మాట్లాడేందుకు అవకాశం కల్పించినా వినియోగించుకోలేదన్నారు. అధికార పక్షంపై నిందలు మోపుతూ ఉనికి కోసం రాద్దాంతం చె శారని అన్నారు. గత నాలుగేళ్లలో 10 కోట్ల పనులు కూడా చేయలేకపోయారని చెప్పుకొస్తూ గత పాలనలో కాంట్రాక్టర్లకు రూ.30 నుంచి 40 కోట్ల వరకు బిల్లులు పెండింగ్లో ఉంచారని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత గత యేడాది కాలంలోనే నిరంతర అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందన్నారు. యేడాదిలో దాదాపు రూ.25 కోట్ల పనులు చేపట్టగా ఇందులో సుమారు 20 కోట్లు మున్సిపల్ నిధులే ఉన్నాయని తెలిపారు.

ఇప్పటికే కబ్జాలకు గురైన చిలుక వాగు అభివృద్ధికి రూ. 16 కోట్లు కేటాయించగా పూర్తిగా ప్రక్షాళన చేసేందుకు మరో రూ.25 కోట్లతో టెండర్లను ఆహ్వానించబోతున్నట్లు తెలిపారు. దీంతో పాటు రూ.10 కోట్లతో గొల్ల చెరువు మురుగు నీరు శుద్ధి, అమృత్ 2.0 ద్వారా మంజూరైన రూ. 27 కోట్లతో కొత్త కాలనీలలో తాగునీటి ట్యాంకులు, ఇతర అభివృద్ధి పనులు చేపట్టడం జరుగుతుందన్నారు. వచ్చే వేసవిని దృష్టిలో ఉంచుకుని తాండూరు. కాగ్నానది పంపుహౌస్ మరమ్మత్తులు చేపట్టేందుకు దృష్టిసారిస్తున్నట్లు తెలిపారు. మోటార్లు, పైపులైన్ల కోసం రూ.35 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేయడం జరిగిందన్నారు.

ముఖ్యంగా తాండూరు మున్సిపల్ 75 ఏండ్ల ఉత్సవాల సందర్భంగా తాండూరులో అండర్ డ్రైనేజీ వ్యవస్థను ప్రారంభించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. సీఎం రె వంత్ రెడ్డి సహాకారంతో ఇందుకోసం రూ.500 కోట్లను సాధించుకునేందుకు కృషి చేయడం జరుగుతుందన్నారు. రాబోయో రోజుల్లో తాండూరు రూపు రేఖలు మార్చి చూపిస్తామన్నారు.

అందరి సహాకారంతో అభివృద్ధి : చైర్ పర్సన్ స్వప్న పరిమళ్
గత ఐదేళ్లుగా అందరి సహాకారంతో తాండూరు మున్సిపల్ లో అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందని చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ అన్నారు. మొదట్లో కరోనా, తరువాత ఎన్నికలు, వర్గ పోరు వల్ల నాలుగేళ్లు అభివృద్ధి చేసుకోలేకపోయామన్నారు. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సహాకారంతో ఒక యేడాదిలో పార్టీలకతీతంగా అభివృద్ధి చేయడం జరుగుతుందన్నారు. ఈ అవకాశం దక్కడం సంతోషంగా ఉందన్నారు. అయితే ప్రతిపక్షం కౌన్సిలర్లు వారికి ఎన్ని అవకాశాలు ఇచ్చినా రాద్దాంతపు రాజకీయాలే చేశారని అన్నారు.

అవకాశాలు వినియోగించుకోకపోవడమే కాకుండా నిరనసలు చేయడం సమంజసం కాదన్నారు. చివరి సమావేశంలో కూడా ఉనికి రాజకీయాలు చేశారని అన్నారు. మళ్లీ అవకాశం ఉంటే ప్రజా సేవకు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ వైస్ చైర్సన్ పట్లోళ్ల రత్నమాల నర్సింలు, ఫ్లోర్ లీడర్ మధుబాల, కౌన్సిలర్లు పట్లోళ్ల నీరజాబాల్ రెడ్డి, అబ్దుల్ రజాక్, ప్రభాకర్ గౌడ్, సోమశేఖర్, విజయాదేవి, మమత, బోయరవి, వెంకన్న గౌడ్, రాము, భీంసింగ్, బోంబీనా, సల్మా పాతిమా, అఫ్రీన్ జవేరియా, బీజేపీ ఫ్లోర్ లీడర్ అంతారం లలిత, కౌన్సిలర్లు సాహు శ్రీలత లక్ష్మీకాంత్, పూజా రజనీకాంత్, బాలప్ప తదితరులు పాల్గొన్నారు.

బీఆర్ఎస్ కౌన్సిలర్ల నిరసన
మున్సిపల్ చివరి సమావేశంపై బీఆర్ఎస్ కౌన్సిలర్లు నిరసన వ్యక్తం చేశారు. లాస్ట్ మీటింగులో తమకు మాట్లాడే అవకాశం కల్పించ లేదని వాపోయారు. సమావేశం ముగిసిన తరువాత కౌన్సిల్ హాల్ తలుపు వద్ద మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీపా నర్సింలు, ఫ్లోర్ లీడర్ శోభారాణి, కౌన్సిలర్లు వరాల శ్రీనివాస్ రెడ్డి, ఆసీఫ్, మంకాల రాఘవేందర్, సంగీత ఠాకూర్, లత గౌడ్, ఎర్రం వసంత, కోఆప్షన్‌ సభ్యురాలు సారంగా విజయ్‌లు బైటాయించి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

oplus_0

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరైనప్పటికి చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ lady డాన్ లా ఎమ్మెల్యేను కూడా మాట్లాడనివ్వలేదని ఆరోపించారు. చైర్ పర్సన్ సమావేశాన్ని బీజేపీ, టీజేఎస్ కౌన్సిలర్లతో ఏకపక్షంగా కొనసాగించారని అన్నారు. నాలుగేళ్లు చైర్ పర్సన్ అవినీతి పాలన చేశారంటూ ద్వజమెత్తారు. చివరి సమావేశంలో మాట్లాడేందుకు అవకాశం ఇవ్వకుండా ప్రతిపక్షాల గొంతు నొక్కేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎజెండాలో ప్రజా అవసరం లేని అంశాలపై డీసెంట్ నోట్ ఇస్తామని, వాటిని రద్దుచేయిస్తామన్నారు.

నాగారం నర్సింలుకు నివాళులు
అంతకుముందు కౌన్సిల్ సమావేశంలో మున్సిపల్ మాజీ చైర్మన్ నాగారం నర్సింలుకు నివాళులు అర్పించారు. నాగారం నర్సింలు సేవలను గుర్తుచేసుకుంటూ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, చైర్ పర్సన్ స్వప్న పరిమళ్. కమీషనర్ విక్రమ్ సింహారెడ్డి, కౌన్సిలర్లు, అధికారులు నివాళులు అర్పించారు. అనంతరం కార్యాలయంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.

ఇదికూడా చదవండి…

జైలుకు వెళ్లినా మద్యం మాన్తలేరు..!