నాగ దేవతల్లారా.. దీవించండి..!
– తాండూరులో ఘనంగా నాగుల పంచమి
– పుట్టలకు పూజలు.. పాలు పోసిన మహిళలు, యువతులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలో నాగుల పంచమి పండగ ఘనంగా జరుపుకున్నారు. నాగదేవతలను భక్తిశ్రద్ధలతో పూజించేందుకు మహిళలు, యువతులు పెద్ద సంఖ్యలో ఆయా ప్రాంతాల్లోని నాగుల కట్టలు, పుట్టల వద్దకు తరలివచ్చారు. సంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించి పాలు పోసి మొక్కులు చెల్లించుకున్నారు.

పట్టణంలోని శాంత్ మహల్ థియేటర్ ప్రాంగణంలోని పుట్ట వద్ద ఉదయం నుంచే భక్తుల సందడి కనిపించింది. మహిళలు పుట్టలకు పసుపు, కుంకుమలు సమర్పించి, పూలతో అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పుట్టలకు పాలు పోసి నాగదేవతను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

అదేవిధంగా సాయిపూర్‌లోని దేవాలయం వద్ద, అంతప్ప భావి శివాలయం, చించోలి రోడ్డు మార్గంలోని నాగుల కట్ట వద్ద కూడా నాగుల పంచమి వేడుకలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. పాత తాండూరు, ఇందిరానగర్, మల్‌రెడ్డిపల్లి తదితర ప్రాంతాల్లోనూ మహిళలు, యువతులు నాగదేవతలకు ప్రత్యేక పూజలు చేశారు.

నాగుల పంచమి రోజున నాగదేవతలను పూజిస్తే కుటుంబానికి శుభం కలుగుతుందని, సుఖసంతోషాలు, ఆరోగ్యం కలగాలని భక్తుల విశ్వాసం. దీంతో పట్టణంలోని పలు ప్రాంతాల్లో పుట్టలు, నాగుల కట్టల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి తమ మొక్కులు తీర్చుకున్నారు.


