రూ.20ల లంచం కేసు..!
– 26ఏళ్ల తరువాత ఉద్యోగులకు విముక్తి
– కీలక తీర్పు వెలువరించిన సుప్రీం కోర్టు
దర్శిని డెస్క్ : రూ.120 లంచం డిమాండ్ చేశారనే ఆరోపణలతో నమోదైన కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. గుజరాత్‌కు చెందిన ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులను నిర్దోషులుగా ప్రకటించింది. లంచం డిమాండ్ చేసినట్లు స్పష్టమైన ఆధారాలు లేనప్పుడు.. కేవలం రూ.20 నగదు స్వాధీనం చేసుకున్నంత మాత్రాన నిందితులను దోషులుగా నిర్ధరించలేమని స్పష్టం చేసింది.

గుజరాత్‌లోని ఆనంద్ జిల్లా బెచ్రీ గ్రామంలో 1996 ఫిబ్రవరిలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఓ విద్యార్థి ఆదాయ ధ్రువీకరణ పత్రం కోసం పంచాయతీ కార్యాలయాన్ని ఆశ్రయించాడు. అక్కడ పనిచేస్తున్న క్లర్క్ రూ.120 లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఇందులో రూ.100 తనకు, రూ.20 ప్యూన్‌కు ఇవ్వాలని కోరినట్లు ఫిర్యాదు నమోదైంది.

దీంతో విద్యార్థి ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. అధికారులు వల పన్ని లంచం తీసుకునే సమయంలో ప్యూన్‌ను పట్టుకున్నారు. అతడి వద్ద రూ.20 మాత్రమే స్వాధీనం చేసుకున్నారు. అయితే క్లర్క్‌కు ఇవ్వాల్సినట్లు ఆరోపించిన రూ.100 మాత్రం లభించలేదు. ఈ కేసులో ట్రయల్ కోర్టు 1999లో ఇద్దరు ఉద్యోగులను దోషులుగా తేల్చింది. అనంతరం గుజరాత్ హైకోర్టు కూడా ఆ తీర్పును సమర్థించింది. దీంతో నిందితులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

కేసు విచారణలో బాధితుడి వాంగ్మూలంలో వైరుధ్యాలు ఉన్నట్లు సుప్రీంకోర్టు గుర్తించింది. అంతేకాకుండా క్లర్క్ లంచం డిమాండ్ చేసినట్లు, ప్యూన్ లంచం అడిగినట్లు నిర్ధారించే బలమైన ఆధారాలు లేవని పేర్కొంది. ప్యూన్ తన వద్ద లభించిన రూ.20ను ఈద్ పండుగ సందర్భంగా విద్యార్థి ఇచ్చినట్లు చేసిన వాదనను కూడా కోర్టు పరిశీలించింది.

లంచం డిమాండ్, స్వీకరణకు సంబంధించిన ఆరోపణలను కేవలం నగదు స్వాధీనం ఆధారంగా నిర్ధరించలేమని పేర్కొన్న ధర్మాసనం.. ట్రయల్ కోర్టు, హైకోర్టు తీర్పులను పక్కనపెట్టింది. జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ అతుల్ ఎస్. చందూర్కర్లతో కూడిన ధర్మాసనం ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులను నిర్దోషులుగా ప్రకటించింది.


